Breaking News

ఒక్క కిలో కూడా తరుగు రావద్దు…

నిజామాబాద్‌, అక్టోబర్‌ 30

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ మండలం కాలూర్‌ గ్రామంలో సిద్దిరామేశ్వర్‌ రైస్‌మిల్‌ను జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. శుక్రవారం నిజామాబాద్‌ మండలం కాలూర్‌ గ్రామంలో సిద్ది రామేశ్వర్‌ రైస్‌ మిల్‌లో ధాన్యం సేకరణ, కస్టమర్‌ మిల్లింగ్‌ ప్రక్రియ పరిశీలించారు. రైస్‌ మిల్‌ ప్రక్కన కోత కోస్తున్న హర్వేస్టర్‌, కోసిన ధాన్యం నాణ్యతను పరిశీలించారు.

ఈ సందర్బంగా రైతులతో మాట్లాడారు. అనంతరం హార్వెస్టర్‌ యజమానులతో మాట్లాడారు. వానాకాలం ధాన్యం సేకరణలో 9 లక్షల టన్నుల ఉత్పత్తి సాదించటం లక్ష్యంగా చేసుకున్నామని, అందులో 7 లక్షల టన్నుల వరి ధాన్యాన్ని జిల్లాలోని 445 కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరించి 247 రైస్‌ మిల్లర్లకు కేటాయింపు చేయటం జరిగిందని, ప్రతి కొనుగోలు కేంద్రం వద్ద టెస్ట్‌ చేసి వరి దాన్యాన్ని రైస్‌ మిల్‌లకు పంపేవిదంగా ఒక ఏఇవోను నియమించడం జరిగిందన్నారు. ఆ అధికారి వచ్చిన దాన్యాన్ని టెస్ట్‌ చేసి నాణ్యమైన వడ్లను సర్టిఫై చేస్తారని, టెస్ట్‌ చేసిన దాన్యాన్ని కడ్త లేకుండా తీసుకుంటారని అన్నారు.

వరి నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ తేమ 17 శాతం లోపు, తాలు ఒక్క శాతం, మట్టి పెళ్ళలు 1 శాతం, చెడిపోయిన రంగు మారిన, మొలకెత్తిన, పురుగు తిన్న ధాన్యము 3 శాతం ఉంటే అటువంటి దాన్యాన్ని ఏ గ్రేడ్‌గా పరిగణించి క్వింటాలుకు 1888 రూపాయలు, కామన్‌ రకానికి 1868 రూపాయలకు రైతుల నుండి ప్రభుత్వం ద్వారా కొనుగోలు చేస్తున్నామని అన్నారు. గత సీజనులో 1010 రకానికి తెగులు రావడము వల్ల క్వాలిటీలో కొంత తేడా వచ్చిందని, అప్పుడు తరుగు తీయడం జరిగిందన్నారు. కాని నిజామాబాద్‌లో తరుగు ఒక అలవాటుగా మారిందని, మిగతా జిల్లాల్లో ఎక్కడా లేదన్నారు.

ఈ సీజనులో ఒక్క కిలో కూడా తరుగు రావద్దు అనే ముఖ్య ఉద్దేశ్యం తో పోతున్నామని తెలిపారు. అధికారులు, రైతులు, ప్యాక్స్‌ చైర్మన్లు, మిల్లర్లు అందరూ కలసి రైతుకు తరుగు లేకుండా కొనుగోలు చేయాలని, ఎఫ్‌ఏక్యూ ప్రమాణాలతో తెచ్చిన వరి దాన్యానికి గరిష్ట గిట్టుబాటు ధర రావాలంటే కటింగ్‌ ఉండరాదని, అదేవిధంగా హార్వెస్టర్‌తో కోత చేస్తున్న సందర్భంలో స్పీడ్‌గా వెళ్లకుండా, స్పీడ్‌ను 19 – 20 ఆర్‌పిఎంలో, గేర్‌లు ఏ2 – ఏ3 లో పోతే మంచి ధాన్యం వస్తుందని, బ్లౌవర్‌ పని సరి చూసుకోవాలని, బ్లౌవర్‌ మంచిగా ఉంటే తాలు ఉండదన్నారు. పొలం పచ్చిగా ఉన్నపుడు కటింగ్‌ చేయకుండా, ఎండిన పొలంలో పంటను కటింగ్‌ చేయాలన్నారు.

ప్రతి కొనుగోలు కేంద్రం వద్ద చెన్ని మిషన్‌ ఏర్పాటు చేసామని, అవసరమున్న రైతులు చెన్ని పట్టి కొనుగోలు కేంద్రాల వద్దకు తేవాలని, కేంద్రాల వద్ద ఉన్న ఏవోలు టెస్ట్‌ చేసి సర్టిఫికేట్‌ ఇస్తారని, మిల్లర్‌లు టెస్ట్‌ చేసిన ధాన్యం కటింగ్‌ చేస్తే సీజ్‌ చేస్తాం అని కలెక్టర్‌ అన్నారు. ప్రతి రైతు జాగ్రత్తలు తీసుకొని దాన్యం కొనుగోలు కేంద్రాలకు తేవాలని సూచించారు. రైతులు మిల్లర్లను ప్రాధేయపడే పరిస్థితి రావద్దని, అన్ని జాగ్రత్తలు సెంటర్‌ వద్దనే తీసుకొని రైస్‌ మిల్లర్‌కు పంపాలని, రైతులు చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే దీనిని అధిగమించవచ్చని అన్నారు.

హమాలీలను రైతులకు మాట్లాడి ఇవ్వాలని అధికారులకు సూచించారు. కొనుగోలు చేసిన వరి దాన్యాన్ని వెంటనే రైస్‌ మిల్లర్లకు పంపాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో అగ్రికల్చర్‌ జెడి గోవింద్‌, డిసిఓ సింహాచలం, సివిల్‌ సప్లయి అధికారులు, నిజామాబాద్‌ ఎమ్మార్వో ప్రవీణ్‌, సర్పంచ్‌, ఎంపీటీసీ, ప్యాక్స్‌ చైర్మన్‌ తదితరులు పాల్గొన్నారు.

Check Also

నా కష్టార్జితం ఇప్పించండి

నిజామాబాద్‌, మే 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : యుఏఇ రాజధాని అబుదాబి లోని తన యాజమాన్య కంపెనీ ...

Comment on the article