Breaking News

రెండు మూడు రోజుల్లో మరింత సులభతరం

నిజామాబాద్‌, నవంబర్‌ 3

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రెండు మూడు రోజుల్లో ధరణి పోర్టల్‌ ద్వారా నిర్ణీత సమయంలో రిజిస్ట్రేషన్లు చేయడానికి అధికారులు అన్ని చర్యలు తీసుకుంటున్నారని జిల్లా కలెక్టర్‌ సి. నారాయణ రెడ్డి తెలిపారు. మంగళవారం ఇందల్వాయి మండల కేంద్రంలో కలెక్టర్‌ తహసిల్దార్‌ కార్యాలయంలో ధరణి పోర్టల్‌ ద్వారా రిజిస్ట్రేషన్‌ ప్రక్రియను, ధాన్యం కొనుగోలు కేంద్రంలో కొనుగోలు విధానాన్ని పరిశీలించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ సోమవారం 23 కు గాను 19 స్లాట్స్‌ పూర్తి చేశారని, మంగళవారం 25 స్లాట్స్‌ రిజిస్టర్‌ చేసుకున్నారని తెలిపారు. ఈ ప్రక్రియ కొత్తగా అమలు చేస్తున్నందున సిబ్బంది, అధికారులు రెండు మూడు రోజుల్లో దీని పనితీరుపై పూర్తి అవగాహన చేసుకొని నిర్ణీత సమయంలో రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ పూర్తి చేయనున్నారని తెలిపారు. తద్వారా రిజిస్ట్రేషన్‌ మరియు మ్యుటేషన్‌ పూర్తి చేసి భూములు విక్రయించిన, కొనుగోలు చేసిన రైతుల భూమి వివరాలకు సంబంధించి మార్పులు చేర్పులు పూర్తి చేసి పాస్‌ బుక్కులు అందిస్తారని కలెక్టర్‌ వివరించారు.

రైతులకు ఇబ్బందులు కలగకుండా మెరుగైన సేవలు ధరణి పోర్టల్‌ ద్వారా అందించడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకోవడానికి ఆదేశించడం జరిగిందన్నారు. అదేవిధంగా నాన్‌ అగ్రికల్చర్‌ భూములకు సంబంధించి గ్రామాల్లోనూ మున్సిపాలిటీలలోను అన్ని వివరాలను క్యాప్చర్‌ చేశామని, ప్రభుత్వ ఆదేశాలు జారీ కాగానే వాటి రిజిస్ట్రేషన్లకు కూడా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

వరి కోత సమయంలో చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవడం వల్ల నాణ్యత లోపాలు లేకుండా ధాన్యాన్ని సిద్ధం చేసుకోవచ్చని కలెక్టర్‌ పేర్కొన్నారు. ఇందల్వాయి మండల కేంద్రంలో ధాన్యం కొనుగోలు జరుగుతున్న విధానాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులు మరియు మీడియాతో మాట్లాడుతూ కొనుగోలు ప్రక్రియ జిల్లాలో వేగంగా నడుస్తున్నదని సోమవారం వరకు లక్షకు పైగా మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని రోజుకు 25 వేల మెట్రిక్‌ టన్నులు కొనే విధంగా అన్ని ఏర్పాట్లు చేసుకొని ఆ దిశగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించామన్నారు.

లారీలు, గన్ని బ్యాగులు, లేబర్‌ కొరత లేకుండా చూసుకోవాలని అధికారులకు సూచించామన్నారు. నాణ్యమైన ధాన్యం రావడానికి హార్వెస్టర్‌ యంత్రం వేగాన్ని సూచించిన మేరకు నడిపితే చెన్ని పట్టే అవసరం లేకుండా ఉంటుందని సూచించారు. జిల్లాలో కడ్తా అనే పదం వినపడవద్దని రైస్‌ మిల్లర్లను ఆదేశించారు.

కొనుగోలు కేంద్రాలకు ఏ రకం ధాన్యం తెస్తున్నాడో ఆ వివరాలను నమోదు చేస్తున్నామని ఒకవేళ ప్రభుత్వం సన్న రకం ధాన్యానికి సంబంధించి ఏమైనా ప్రత్యేక చర్యలు తీసుకుంటే ఆ వివరాలను ప్రభుత్వానికి నివేదిస్తామని తెలిపారు. కార్యక్రమాల్లో డిసిఓ సింహాచలం, తహసిల్దార్‌ రమేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Check Also

నా కష్టార్జితం ఇప్పించండి

నిజామాబాద్‌, మే 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : యుఏఇ రాజధాని అబుదాబి లోని తన యాజమాన్య కంపెనీ ...

Comment on the article