Breaking News

వ్యాధులనుండి కాపాడుకోవాలి

నిజామాబాద్‌, డిసెంబర్‌ 1

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసే క్యాంపులలో మూగజీవాలకు మందులు ఇప్పించి వాటిని రోగాల బారినుండి కాపాడుకోవాలని జిల్లా కలెక్టర్‌ సి. నారాయణ రెడ్డి కోరారు. మంగళవారం మోపాల్‌ మండల కేంద్రంలో వెటర్నరీ, పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన నట్టల నివారణ వారోత్సవాల ప్రారంభ కార్యక్రమానికి కలెక్టర్‌ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు.

డిసెంబర్‌ 1 నుండి 7 వరకు పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో క్యాంపులు ఏర్పాటు చేసి గొర్రెలు, మేకలలో నట్టల నివారణ కొరకు మందులు వేయనున్నారని తెలిపారు. గొర్రెలు, మేకలు ఉన్న రైతులు కానీ, యజమానులు కానీ నిర్లక్ష్యం చేయకుండా తప్పనిసరిగా వారి మూగజీవాలకు ఉచిత నట్టల నివారణ మందు వేయించి కాపాడుకోవాలని కోరారు. మూగజీవాలు చనిపోకుండా పశు సంవర్ధక శాఖ అధికారుల సలహాలు సూచనలను కూడా ఎప్పటికప్పుడు పాటిస్తూ ఆర్థికంగా ఎదగడానికి కషి చేయాలని కలెక్టర్‌ సూచించారు.

అదేవిధంగా డిసెంబర్‌ 15 నుండి 60 రోజుల పాటు పశువులకు గాలికుంటు వ్యాధి నివారణకు ఉచితంగా టీకాలు వేయనున్నారని ఇందులో కూడా రైతులు వారి పశువులకు టీకాలు వేయించి వ్యాధులనుండి కాపాడుకోవాలని కోరారు. పశువుల కొట్టాలకు, గొర్రెలు మేకల షెడ్స్‌ కొరకు ఉపాధి హామీ పథకంలో అవకాశం ఉన్నదని ఆసక్తిగల రైతులు ఎంపీడీవోలకి గాని పశుసంవర్ధక శాఖ అధికారులకు కానీ దరఖాస్తు చేసుకోవాలని, ప్రతి మండలంలో 200 వరకు మంజూరు చేయడానికి వీలు కల్పిస్తామన్నారు.

యాదవులకు గొర్రెల పంపిణీకి ఆదేశాలు జారీ చేస్తూ ఫిబ్రవరిలో ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని కానీ కరోనా వైరస్‌ వల్ల రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం 50 వేల కోట్ల వరకు తగ్గడమే కాకుండా ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అయిందని దానికి తోడు కరోనా నివారణకు ప్రభుత్వం పెద్ద ఎత్తున ఖర్చు చేయవలసి రావడం, మూడు నెలలపాటు ప్రజలకు ప్రతి కుటుంబానికి పదిహేను వందల రూపాయలు చొప్పున బ్యాంకు ఖాతాల్లో జమ చేయడం ఉచితంగా బియ్యాన్ని పంపిణీ చేయడంతో గొర్రెల పంపిణీ కార్యక్రమం జరగలేదని వచ్చే బడ్జెట్‌లో ప్రభుత్వం నిధులు కేటాయించగానే ఆ దిశగా చర్యలు తీసుకుంటామని తెలిపారు.

ఉపాధి హామీ పథకంలో చిన్న, సన్నకారు రైతులు పశుగ్రాసం సాగు చేసుకోవడానికి, నీటి కుంటల నిర్మాణానికి అవకాశం ఉన్నందున రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా వెటర్నరీ పశుసంవర్ధక శాఖ అధికారి ఎల్లన్న, ఎంపీడీవో వీర్‌ సింగ్‌, అధికారులు, రైతులు, తదితరులు పాల్గొన్నారు.

Check Also

నా కష్టార్జితం ఇప్పించండి

నిజామాబాద్‌, మే 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : యుఏఇ రాజధాని అబుదాబి లోని తన యాజమాన్య కంపెనీ ...

Comment on the article