Breaking News

ఉపాధి హామీలో కొనసాగుతున్న పనులన్నీ పక్కాగా జరగాలి

నిజామాబాద్‌, డిసెంబర్‌ 10

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జాతీయ ఉపాధి హామీ పథకం కింద గ్రామాల్లో నిర్వహిస్తున్న పనులన్నీ పక్కాగా జరిగేలా చూడాలని, గ్రామ కార్యదర్శులు అన్ని రకాల పనులను పర్యవేక్షించాలని జిల్లా కలెక్టర్‌ సి. నారాయణ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం సెల్‌ కాన్ఫరెన్సు ద్వారా మండల ప్రత్యేక అధికారులు ఎంపీడీవోలు, ఏపీఓలు, డిఆర్‌డిఓ ఇతర అధికారులతో పలు అంశాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామ కార్యదర్శులు అర్ధ భాగం విధులు పంచాయతీలకు సంబంధించి మిగతా అర్ధభాగం విధులు జాతీయ ఉపాధి హామీ పథకానికి కేటాయించాలని ఆయన ఆదేశించారు. జాతీయ ఉపాధి హామీ పథకం కేంద్ర సంయుక్త కార్యదర్శి బందం జిల్లాలో కొనసాగుతున్న పనులను రెండు మూడు రోజుల్లో పరిశీలించనున్న నేపథ్యంలో గ్రామస్థాయిలో అన్ని పనులను సంబంధిత 7 రిజిస్టర్‌ ఇప్పటివరకు నమోదు చేయాలని ఆదేశించినప్పటికీ ఇంకా కొన్ని గ్రామాలలో పనులు పూర్తి కాకపోవడంపై కలెక్టర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ పనులన్నీ రెండు రోజుల్లో పూర్తిచేయాలని లేదంటే ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు. గ్రామ కార్యదర్శి అంటే గ్రామానికి ఒక నోడల్‌ అధికారిగా బాధ్యతతో విధులు నిర్వహించాల్సి ఉంటుందని గ్రామానికి సంబంధించిన ఇతర విధులతో పాటు ఉపాధి హామీ పథకానికి సంబంధించిన పండగ కూడా పర్యవేక్షించాల్సిన బాధ్యత అతనిపై ఉందన్నారు. ఈ విషయంలో ఎంపీడీవోలు మండల స్థాయిలో ప్రోగ్రామ్‌ ఆఫీసర్‌గా ఉంటూ గ్రామాలలో జరుగుతున్న పనులపై పర్యవేక్షణ చేయాలన్నారు.

వెంటనే ఉపాధి హామీ పథకానికి సంబంధించి అన్ని రికార్డులు అప్‌డేట్‌ చేయాలని, హరితహారం మొక్కలను ఎండిపోకుండా చూడటంతోపాటు వాటి రక్షణకు అన్ని చర్యలు తీసుకోవాలని వన సేవకులతో మాట్లాడి వారి విధులపై స్పష్టత ఇవ్వాలని డ్రైయింగ్‌ ప్లాట్‌ఫారాలు వెంటనే పూర్తి చేయించాలని ఆదేశించారు. ప్రతి మండలంలో తప్పనిసరిగా కనీసం పది శాతం కూలీలు హాజరయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని గ్రామాలలో ఎప్పటికప్పుడు పారిశుద్ధ్య కార్యక్రమాలు పక్కాగా నిర్వహించాలని ఆదేశించారు.

సోమవారం నుండి ప్రతిరోజు గ్రామాలలో పర్యటించి ఈ పనులను పర్యవేక్షించడం జరుగుతుందని ఎక్కడైనా తేడా వస్తే ఉపేక్షించేది లేదని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. మండల ప్రత్యేక అధికారులుగా విధులు నిర్వహిస్తున్న జిల్లా స్థాయి అధికారులు వారికి కేటాయించిన మండలాల్లో పర్యటించి పనులను పరిశీలించి నివేదికలు అందజేయాలని ఆదేశించారు. కాన్పరెన్సులో అదనపు కలెక్టర్‌ లత, డిఆర్‌డిఓ శ్రీనివాస్‌, ఎంపీడీవోలు, ఏపీఓలు, ఉపాధి హామీ పథకం అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Check Also

కోవిడ్‌ పేషంట్‌ల‌తో మాట్లాడిన కలెక్టర్‌

నిజామాబాద్‌, మే 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆరోగ్య కార్యకర్తలు మీ ఇంటికి ప్రతిరోజు వస్తున్నారా మీకు ...

Comment on the article