Breaking News

ఉపాధ్యాయ సమస్యలు పరిష్కరించాలి

నిజామాబాద్‌, డిసెంబర్‌ 14

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సోమవారం భారతీయ జనతా పార్టీ నిజామాబాద్‌ జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల సమస్యలు పరిష్కరించాలని జిల్లా కలెక్టరేట్‌ వద్ద ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు బస్వా లక్ష్మి నర్సయ్య మాట్లాడారు.

ఐదు సంవత్సరాలకు ఒకసారి వర్తింప చేయవలసిన పిఆర్‌సి గడువు 01-07-2018న ముగిసినప్పటికీ మూడు సంవత్సరాలు సమీపిస్తున్నా ప్రక్క ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం రెండు సంవత్సరాల నుండి 27% ఐఆర్‌ ఇస్తున్నప్పటికీ పిఆర్‌సి అమలు చేయనందుకు వెంటనే పిఆర్‌సి ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. ఉపాధ్యాయులకు నెల నెల ఇచ్చే పదోన్నతులు ఆరు సంవత్సరాలుగా నిలిచిపోవడం జరిగిందని, తక్షణమే పదోన్నతుల ప్రక్రియ ప్రారంభించాలన్నారు.

2012వ సంవత్సరంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో అంతర్‌ జిల్లా బదిలీలు జరిగిన పిదప తెలంగాణ రాష్ట్రంలో 8 సంవత్సరాలుగా అంతర్‌ జిల్లా బదిలీలు లేకపోవడం వల్ల ముఖ్యంగా భార్య, భర్తలు ఉద్యోగులైనవారు ఇబ్బందులకు గురవుతున్నారని, తక్షణమే అంతర్‌ జిల్లా, ఇతర బదిలీలు చేపట్టాలన్నారు. 70 సంవత్సరాలు నిండిన పెన్షనర్లకు 10వ పిఆర్‌సిలో ప్రతిపాదించిన కాంటమ్‌ ఆఫ్‌ పెన్షన్‌ వర్తింపజేస్తూ పెన్షనర్ల తెలంగాణ ఇన్సెంటివ్‌ ప్రకటించాలని, జనవరి, జులై 2020ల రెండు విడుతల కరువు భృతిని డిఎ మంజూరు చేయాలన్నారు.

కెజి టు పిజి విద్యను అమలు చేస్తానన్న కెసిఆర్‌ విద్యావ్యవస్థను నిర్వీర్యం చేశారని, యూనివర్సిటీ వైస్‌ ఛాన్స్‌లర్‌ పోస్టులను భర్తీ చేస్తూ కెజి టు పిజి విద్యను పటిష్టతకు వెంటనే చర్యలు చేపడుతు, కరోనాకు జాగ్రత్తలు తీసుకొని విద్యాసంస్థలను ప్రారంభించాలన్నారు.

పై అన్ని సమస్యలు పరిష్కారం చేస్తానని కెసిఆర్‌ 16 మే 2018 న ఉద్యోగ సంఘాల సమావేశంలో హామీ ఇచ్చి అమలు చేయలేదన్నారు. కార్యక్రమంలో యెండల లక్ష్మి నారాయణ, ధన్‌ పాల్‌ సూర్యనారాయణ, న్యాలం రాజు, పోతన్‌ కార్‌ లక్ష్మీనారాయణ, రుయ్యడి రాజేశ్వర్‌, స్రవంతి రెడ్డి, మల్లేష్‌ యాదవ్‌, నూతుల శ్రీనివాస్‌ రెడ్డి, రాజశేఖర్‌ రెడ్డి, కార్పొరేటర్లు, మండల అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Check Also

కోవిడ్‌ పేషంట్‌ల‌తో మాట్లాడిన కలెక్టర్‌

నిజామాబాద్‌, మే 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆరోగ్య కార్యకర్తలు మీ ఇంటికి ప్రతిరోజు వస్తున్నారా మీకు ...

Comment on the article