Breaking News

రికార్డుల నిర్వహణ ఎప్పటికప్పుడు జరగాలి

నిజామాబాద్‌, డిసెంబర్‌ 15

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఉపాధి హామీ పథకం ద్వారా నిర్వహిస్తున్న పనులకు తప్పనిసరిగా గ్రామ పంచాయతీ తీర్మానం ఉండాలని, అదేవిధంగా నిర్వహించిన పనులకు ఆధారాలను రికార్డ్‌ చేయాలని, నిర్వహించిన పనులకు రిజిస్టర్‌లలో నమోదు తప్పనిసరిగా జరగాలని మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి పథకం ప్రత్యేక కమిషనర్‌ సైదులు సంబంధిత అధికారులను ఆదేశించారు.

జిల్లా పర్యటనలో భాగంగా ఆయన ప్రగతి భవన్‌ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్‌ సి.నారాయణ రెడ్డి, డిఆర్‌డిఎ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ పథకం కింద నిర్వహించే అన్ని పనులను కూడా గైడ్‌లైన్స్‌ ఆధారంగా మాత్రమే చేపట్టాలని తెలిపారు. గైడ్‌లైన్స్‌ ప్రకారం ప్రతి గ్రామ స్థాయిలో మండల స్థాయిలో 7 రిజిస్టర్లు నిర్వహించవలసి ఉందని ఆయా గ్రామాల్లో జరిగిన అన్ని పనుల వివరాలను కూడా ఆ రిజిస్టర్‌లో ఎప్పటికప్పుడు నమోదు చేయవలసి ఉన్నదని ఆయన స్పష్టం చేశారు.

తన పర్యటనలో వివరాలను పరిశీలించగా రిజిస్టర్‌ ఉన్నాయా అంటే ఉన్నాయని కానీ సరైన పద్ధతిలో నిర్వహణ జరగడంలేదని అందుకు సంబంధిత అధికారులు ఇకముందైనా వాటి నిర్వహణకు చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. పూడికతీత, చెరువుల తవ్వకం తదితర పనులను నిర్వహించినప్పుడు తప్పనిసరిగా పనులకు ముందు తర్వాత ఫోటోలు తీసుకుని ఆయా ఫైళ్లలో దాచుకోవాలని తనిఖీల సమయంలో లేదా రికార్డుల పరిశీలన వాటికి సరైన ఆధారాలు చూపించగలుగుతామని పేర్కొన్నారు. ప్రతి పనికి క్లారిటీ ఉండాలని ఉద్బోదించారు.

అదేవిధంగా ప్రతి పనికి కూడా ఒక ఫైల్‌తో పాటు అన్ని వివరాలు ఆధారాలు నమోదై ఉండాలని ఆయన తెలిపారు. క్షేత్రస్థాయిలో పనులు జరుగుతున్నప్పుడు ఈ-మస్టర్స్‌ అక్కడ అందుబాటులో ఉండాలని పనులు పర్యవేక్షించే అధికారుల సంతకాలు కూడా ఉండాలని తెలిపారు. వర్క్స్‌ బోర్డులు సరైన పద్ధతిలో అన్ని చోట్ల లేవని వాటిని ఏర్పాటు చేయించాలని తెలిపారు. ప్రతి గ్రామంలో డిమాండ్‌ రిజిస్టర్లు ఉండాలని డిమాండ్‌ను బట్టి కూలీలకు పనులు కల్పించాలని ఈ విషయంలో పంచాయతీ కార్యదర్శి శ్రద్ధ తీసుకోవాలని తెలిపారు.

సాంకేతిక సహాయకులకు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానంతో సంబంధించిన వివరాలు తెలిసి ఉండాలన్నారు. ఎంత పని ఎన్ని గంటలు నిర్వహిస్తే కూలీలకు 237 రూపాయలు వస్తుందో వారికి అవగాహన కల్పించాలని అదేవిధంగా నిర్ణీత సమయంలో కూలి అందించడానికి కూడా చర్యలు తీసుకోవాలని తెలిపారు. జిల్లా కలెక్టర్‌ సి.నారాయణ రెడ్డి అంతకుముందు జిల్లాలో జరుగుతున్న ఉపాధి హామీ పనులు తదితర వివరాలను తెలిపారు.

కొత్త జాబ్‌ కార్డులు జారీ చేయడంతో పాటు పాతవాటిని అప్‌డేట్‌ చేయడానికి అధికారులను ఇప్పటికే ఆదేశించామని, అదే విధంగా ఏడు రిజిస్టర్లు నిర్వహించవలసినదిగా సమావేశాల ద్వారా సూచించామని, ఇకముందు కూడా ఉపాధి హామీ పథకం నియమ నిబంధనల ప్రకారం అధికారులు సిబ్బంది పనిచేసే విధంగా పర్యవేక్షణ చేయడం జరుగుతుందని తెలిపారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు చంద్రశేఖర్‌, లత, ఇన్‌చార్జి డిఆర్‌డివో శ్రీనివాస్‌, ఏపీఓలు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Check Also

కోవిడ్‌ పేషంట్‌ల‌తో మాట్లాడిన కలెక్టర్‌

నిజామాబాద్‌, మే 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆరోగ్య కార్యకర్తలు మీ ఇంటికి ప్రతిరోజు వస్తున్నారా మీకు ...

Comment on the article