మొదటి విడతలో 12 వేల మందికి వ్యాక్సిన్‌

కామారెడ్డి, జనవరి 12

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కోవిడ్‌ వ్యాక్సినేషన్‌ నేపథ్యంలో కామారెడ్డి జిల్లాలో ఏర్పాట్లపై జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో రాష్ట్ర రోడ్లు-భవనాలు, గహ నిర్మాణ, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇందులో ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌, ఎమ్మెల్యేలు హన్మంత్‌ షిండే, జాజుల సురేందర్‌, జడ్పీ చైర్‌ పర్సన్‌ దాఫెదార్‌ శోభ రాజు, డిసిసిబి చైర్మన్‌ పోచారం భాస్కర్‌ రెడ్డి, జిల్లా కలెక్టర్‌ డా.శరత్‌, జిల్లా ఎస్పీ శ్వేత, డిఎంహెచ్‌ఓ పలువురు అధికారులు పాల్గొన్నారు.

మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి మాట్లాడుతూ గత 10 నెలలుగా ప్రపంచాన్ని ఇబ్బంది పెట్టిన కరోనాకు వ్యాక్సిన్‌ ప్రవేశపెట్టిన శాస్త్రవేత్తలకు ధన్యవాదాలు తెలిపారు. తమ ప్రాణాలు సైతం లెక్కచేయకుండా విధి నిర్వహణలో పాల్గొన్న పోలీసులకు, పారిశుధ్య కార్మికులకు, వైద్యులకు, అధికారులకు ధన్యవాదాలు చెప్పారు. కామారెడ్డి జిల్లాలో కరోనా పరీక్షలు నిర్వహించిన వారిలో 22 శాతం ఉన్న పాసిటివ్‌ కేసులు ప్రస్తుతం 0.34 శాతానికి తగ్గిపోయాయని, భారత ప్రభుత్వ ఆదేశాల ప్రకారం అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కోవిడ్‌ వ్యాక్సిన్‌ పంపిణీ చేయడం జరుగుతుందన్నారు.

ఇంత మందికి వ్యాక్సిన్‌ ఒకేసారి ఇవ్వడం చరిత్రలో ఇప్పటివరకు జరగలేదని, మొదటి విడత వాక్సిన్‌ పంపిణీలో దేశంలోని 3 కోట్ల మంది ప్రంట్‌ లైనర్‌లకు (వైద్య సిబ్బందికి, పోలీసులకు, పారిశుధ్య కార్మికులకు, రెవెన్యూ శాఖ సిబ్బందికి) ఇవ్వడం జరుగుతుందని మంత్రి వివరించారు. రాష్ట్రంలో 17 లక్షల మందికి, కామారెడ్డి జిల్లాలో 12 వేల మందికి మొదటి విడతలో ఇవ్వడం జరుగుతుందని, వాక్సిన్‌ పంపిణీకి జిల్లాలో 30 కేంద్రాలను ఏర్పాటు చేసి, 60 మంది వైద్య సిబ్బందిని నియమించడం జరిగిందన్నారు. జిల్లాలో 1200 వాయిల్స్‌ 26 కేంద్రాల్లో భద్రపరిచేందుకు అధికారులు కావాల్సిన ఏర్పాట్లు చేశారని, భారత్‌ బయోటెక్‌ వారు తయారు చేసిన కో వ్యాక్సిన్‌, సీరం ఫార్మా వారు తయారు చేసిన కోవి శీల్‌ వాక్సిన్‌ లు మాత్రమే మనం వాడుతున్నామన్నారు.

వ్యాక్సిన్‌పై అపోహలు అవసరం లేదని, భారత ప్రభుత్వం అన్ని విధాల చర్యలు తీసుకున్న తర్వాతే, శాస్త్రవేత్తల పరిశీలన తర్వాతే వ్యాక్సిన్‌ అందుబాటులోకి తెచ్చిందన్నారు. ఎవరికైనా వాక్సిన్‌ వికటిస్తే వారికి ఎఈ ఎఫ్‌ఐ అనే రియాక్షన్‌ కిట్లను అందుబాటులో ఉంచుతామని, మొదటి విడత వాక్సిన్‌ ఇచ్చిన 28 రోజుల తరువాత రెండవ విడత ఇవ్వడం జరుగుతుందని, రెండవ విడత ఇచ్చిన 14 రోజుల తరువాత మూడవ విడత ఇవ్వడం జరుగుతుందని మంత్రి పేర్కొన్నారు.

కార్యక్రమాన్ని నియోజకవర్గ స్థాయిలో ఎమ్మెల్యేలు ప్రారంభిస్తారని, వ్యాక్సినేషన్‌ విజయవంతం చేయడానికి అవగాహన కల్పించేందుకు ప్రజాప్రతినిధులు భాగస్వామ్యం అవుతారన్నారు.

Check Also

విపత్తుశాఖ వారి మోబైల్‌ యాప్‌ ప్రారంభం

కామారెడ్డి, ఫిబ్రవరి 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విపత్తు శాఖ ద్వారా ప్రచురితమైన ...

Comment on the article