బాన్సువాడ, ఫిబ్రవరి 18
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పది రోజుల్లో నిజాంసాగర్ ప్రాజెక్ట్‌కు కొండపోచమ్మ ప్రాజెక్టు ద్వారా సాగునీటిని విడుదల చేయడం జరుగుతుందని రాష్ట్ర శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. గురువారం బాన్సువాడ మండలం దేశాయిపేటలో నూతనంగా నిర్మించిన ప్రాథమిక సహకార సంఘం భవనం, రైతు వేదిక భవనం, డబుల్ బెడ్ రూమ్ నిర్మాణానికి స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, రోడ్లు భవనాలు, అసెంబ్లీ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, రాష్ట్ర వ్యవసాయ శాఖ, సహకార శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి కలిసి ప్రారంభోత్సవం చేశారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో శాసనసభ స్పీకర్ మాట్లాడుతూ, కొండపోచమ్మ సాగర్ నుంచి సంగారెడ్డి వెళ్లే కాలువ వద్ద గేటు ఏర్పాటు చేస్తే నిజాంసాగర్ ప్రాజెక్టుకు పది రోజుల్లో సాగునీరు వచ్చే వీలుందని చెప్పారు. నిజాంసాగర్ ఆయకట్టు ప్రాంతం పచ్చటి పంట పొలాలతో సస్యశ్యామలం అవుతాయని చెప్పారు. అర్హతగల నిరుపేదలందరికీ డబల్ బెడ్ రూమ్ ఇల్లు అందిస్తామని చెప్పారు.
రైతులు బ్యాంకు నుంచి రుణం పొందకుండా లాభసాటి పంటలు పండించాలనే ఆలోచన చేసి ముఖ్యమంత్రి రైతుకు పెట్టుబడి సాయం, భీమా పథకం అమలు చేశారని పేర్కొన్నారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి మాట్లాడుతూ, మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలను రైతు సాగు చేయాలని అన్నారు. వేరుశనగ, నువ్వులు, కందులు, ఆవాలు కూరగాయలు, ఆయిల్ ఫామ్ వంటి వాటిని పండించి వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చుకోవాలని సూచించారు.
ముఖ్యమంత్రి రైతు ఆధునిక పద్ధతులు అవలంబించి పంటలు పండించాలనే ఉద్దేశంతో క్లస్టర్ల వారీగా రైతు వేదికలు ఏర్పాటు చేశారని అన్నారు. రైతు వేదికలు కొత్తరకం పంట సాగుపై రైతులు చర్చించుకునే విధంగా దోహదపడతాయని అన్నారు. రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి మాట్లాడుతూ, దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో మిషన్ భగీరథ పథకం ద్వారా ఇంటింటికి తాగునీరు అందిస్తున్నామని తెలిపారు.
రైతు బీమా, రైతుకు పెట్టుబడి సహాయం ఏ రాష్ట్రంలోనూ ఇవ్వడం లేదని అన్నారు. రైతులకు మేలు చేయాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి వీటిని ప్రారంభించి, అమలు చేశారని తెలిపారు. స్పీకర్ నియోజకవర్గంలో 180 కోట్లతో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు నిర్మించారని, బాన్సువాడ నియోజకవర్గానికి మరిన్ని డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను మంజూరు చేస్తానని పేర్కొన్నారు.
జిల్లా పరిషత్ చైర్ పర్సన్ శోభ, జిల్లా అదనపు కలెక్టర్ వెంకటేష్ ధోత్రే, ఉమ్మడి జిల్లా డిసిసిబి చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి, ఎంపీపీ నీరజ, జెడ్పిటిసి సభ్యురాలు పద్మ, జిల్లా రైతు సమన్వయ సమితి కన్వీనర్ అంజిరెడ్డి, దేసాయిపేట సర్పంచ్ శ్రవణ్, ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

Nizamabad News

Latest posts by Nizamabad News (see all)
- బోధన్ ప్రాంత ప్రజలు అలర్ట్ - April 19, 2021
- రెండు రోజుల్లో ఇద్దరి మృతి - April 19, 2021
- ఎక్కడివక్కడే… ఏమిటివి… - April 19, 2021