Breaking News

విజ్ఞానశాస్త్రంలో మహిళా శాస్త్రవేత్తలు రాణించాలి

డిచ్‌పల్లి, ఫిబ్రవరి 28

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సుప్రసిద్ధ భౌతికశాస్త్రవేత్త సర్‌ సి.వి. రామన్‌ని స్మరించుకుంటూ తెలంగాణ విశ్వవిద్యాల‌యంలోని వృక్షశాస్త్ర విభాగంలో ఆదివారం రోజున అంతర్జాలంలో ‘‘జాతీయ విజ్ఞాన దినోత్సవాన్ని’’ నిర్వహించారు. కార్యక్రమంలో నలుగురు ప్రఖ్యాత శాస్త్రవేత్తలు ఆచార్య మంజు శర్మ, ఆచార్య ఎస్‌. మోహన్‌ కరుప్పాయిల్‌, ఆచార్య ఆర్‌. మధుబాల‌, డాక్టర్‌ బి. దినేష్‌ కుమార్‌ వక్తలుగా పాల్గొన్నారు.

రిజిస్ట్రార్‌ ఆచార్య నసీం కార్యక్రమాన్ని స్వాగతోపన్యాసంతో ప్రారంభించారు. అనంతరం భారత ప్రభుత్వ మాజీ కార్యదర్శి, పద్మ భూషణ్‌ ఆచార్య మంజు శర్మ మాట్లాడుతూ బయోటెక్నాల‌జీ విభాగంలో మహిళా శాస్త్రవేత్తలు చేస్తున్న కృషిని ప్రశంసిస్తూ, యువత భావి జీవితాల‌ మెరుగుదల‌ కోసం వారు సామర్థ్యాన్ని పెంపొందించుకోవడం నాయకత్వ ల‌క్షణాల‌ను అల‌వర్చుకోవడం ఎంతో అవసరమన్నారు.

‘భారతదేశ ఆర్థిక సమస్యకు ఒకే ఒక పరిష్కారం ఉంది, అది ఒక్క విజ్ఞానశాస్త్రమే అన్నారు. తరువాత డి.వై. పాటిల్‌ ఎడ్యుకేషన్‌ సొసైటీ, కొల్హాపూర్‌కి చెందిన ఆచార్య ఎస్‌. మోహన్‌ కరుప్పాయిల్‌ ‘ది లెగసీ ఆఫ్‌ సర్‌’ అనే అంశంపై ప్రసంగించారు. ఆయన ప్రసంగంలో రామన్‌ జీవితం, పోరాటాలు, అంతిమ విజయాలు మన దేశానికి స్వతంత్ర బ్రిటీష్ కాల‌నీలో మొట్టమొదటి నోబెల్‌ బహుమతిని సాధించి పెట్టాయన్నారు.

తదనంతరం జేఎన్‌టియూ, ఢిల్లీకి చెందిన ఆచార్య ఆర్‌.మధుబాల‌ తన ప్రసంగంలో టీకా అభివృద్ధి, దాని చర్యా విధానం, రోగనిరోధకతలో టీకా పాత్రను సవివరంగా వివరించారు. ప్రస్తుత మహమ్మారి, వ్యాక్సిన్‌ వ్యూహాల‌ గూర్చి చెప్తూ భారత్‌ బయోటెక్‌ నుండి ఉత్పత్తి అయిన కోవాక్సిన్‌ పని విధానాన్ని విశ్లేషించారు. అటు పిమ్మట జాతీయ పోషకాహార సంస్థ, హైద్రాబాద్‌కు చెందిన శాస్త్రవేత్త, పట్టణంలోని గిరిరాజ్‌ కళాశాల‌ పూర్వ విద్యార్థి డాక్టర్‌ బి. దినేష్‌ కుమార్‌ ‘ఎథిక్స్‌ ఆఫ్‌ సైన్స్‌’ అనే అంశంపై ప్రసంగించారు.

తన ప్రసంగంలో కెనడా మన దేశానికి పెన్సిలిన్‌ను ఎగుమతి చేసింది, ప్రస్తుతం మన దేశం కోవిడ్‌ వ్యాక్సిన్‌ను ప్రపంచానికి ఎగుమతి చేస్తుంది. ఇది సైన్స్‌ అండ్‌ టెక్నాల‌జీలో మన పురోగతిని తెలుపుతుందన్నారు. భోపాల్‌ గ్యాస్‌ విషాదం, పోషక అంశాలు మరియు 18 ఏళ్లలోపు పిల్ల‌లు, కార్యకలాపాలు వంటి వాటిపై స్పష్టమైన వివరణలు ఇవ్వడం జరిగిందని, ప్రభుత్వం యొక్క సాహసోపేతమైన నిర్ణయాల‌ను కొనియాడారు. సంతానం లేని జంటలు శాస్త్రీయ సాంకేతిక పరిజ్ఞానం యొక్క వివిధ ప్రోత్సాహకాల‌ ద్వారా కుటుంబంగా మారుతున్న రోజు వచ్చిందన్నారు.

రాబోయే కాలంలో మనకు కావాల‌నుకున్నట్టుగా సంతానాన్ని పొందే రోజు కూడా వస్తుందన్నారు. సమావేశంలో వివిధ రాష్ట్రాలు, మిడిల్‌ ఈస్ట్‌, న్యూజిలాండ్‌, ఆఫ్రికా వంటి దేశాల‌ నుండి దాదాపు 575 మంది పాల్గొన్నారని కార్యక్రమ నిర్వాహకులు డాక్టర్‌ అహ్మద్‌ అబ్దుల్‌ హలీమ్‌ ఖాన్‌ (ఛైర్మన్‌, బీవోఎస్‌) అన్నారు. కార్యక్రమంలో విభాగాధిపతి ఆచార్య బి. విద్యా వర్ధిని, ఆచార్య ఎం. అరుణ, డాక్టర్‌ డి. శ్రీనివాస్‌, డాక్టర్‌ వి. జలంధర్‌, డాక్టర్‌ ఎ. మహేందర్‌, డాక్టర్‌ ఆర్‌. రాజేశ్వరి, డాక్టర్‌ జె. యెల్లోసా, అధ్యాపకులు, పరిశోధక విద్యార్థులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Check Also

అంబేద్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీ పరీక్షలు యథాతధం

నిజామాబాద్‌, మార్చ్‌ 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : డా. బి. ఆర్‌. అంబేద్కర్‌ ఓపెన్‌ యూనివర్శిటీ పరీక్షలు ...

Comment on the article