కామారెడ్డి, మార్చ్ 3
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మార్చి 3 వ తేదీ బుధవారం ప్రపంచ వినికిడి దినోత్సవం పురస్కరించుకొని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన పోస్టర్ను తన ఛాంబర్లో జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వినికిడి సమస్య తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలు పాటించాలని, స్త్రీలు గర్భిణీ సమయంలో డాక్టర్ల సలహాలు లేకుండా మందులు వాడడం వలన పుట్టే బిడ్డలు వినికిడి లోపంతో జన్మించే అవకాశం ఉందని, డాక్టర్ సలహా ప్రకారం మందులు తీసుకోవాలని, అలాగే పుట్టిన ప్రతి బిడ్డ వ్యాధి నిరోధక టీకా తీసుకొనేలా చూడాలని, గవద బిల్లళ్లు, తట్టు వ్యాధి నిరోధక టీకాలు తప్పనిసరిగా ఇప్పించాలని కోరారు.
వినికిడి లోపంతో బాధపడుతున్న చిన్నారులు ఇతర పిల్లలతో కలిసిపోయేలా తల్లిదండ్రులు చూడాలని, తద్వారా వారిలో మానసిక ఆరోగ్యం, భావవ్యక్తీకరణ నైపుణ్యం పెరుగుతుందని అన్నారు. నైపుణ్యం లేనివారితో చెవి గూబిలి తీయించుకోరాదని, చెవిని నూనె, పుల్లతో శుభ్రం చేయరాదని, చెవి లోనికి నీరు చేరకుండా చూడాలని, చెవి నుండి రక్తం, చీము కారుతుంటే సమస్యను తీవ్రంగా భావించి వైద్యులను సంప్రదించాలని, అరవై సంవత్సరాలు పైబడిన వారు ప్రతి సంవత్సరం వినికిడి పరీక్ష చేయించుకోవాలని తెలిపారు.
వైద్య ఆరోగ్య సిబ్బంది గ్రామీణ స్థాయిలో వినికిడి సమస్య తలెత్తకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించాలని, వినికిడి లోపం వున్న వారి పట్ల క్షేత్ర స్థాయిలో వైద్య సహాయం అందించాలని వైద్య ఆరోగ్య సిబ్బందికి సూచించారు. కార్యక్రమంలో డిప్యూటీ జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డాక్టర్ శోభారాణి, డాక్టర్ సుస్మిత డాక్టర్ అనిల్ కుమార్, డిప్యూటీ డెమో రవికుమార్, సంజీవరెడ్డి, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.

Nizamabad News

Latest posts by Nizamabad News (see all)
- అభివృద్ధి పనులకు ప్రభుత్వ విప్ శంకుస్థాపనలు - April 16, 2021
- నిజామాబాద్ జిల్లాకు 1000 డోసుల రెమెడెసివిర్ - April 16, 2021
- మహిళల భద్రతకై క్యూ.ఆర్.కోడ్ - April 16, 2021