Breaking News

అధ్యాపకులు లేకుండానే విద్యాబోధన

కామారెడ్డి, మార్చ్‌ 13

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాల‌ విద్యార్థి సంఘాలు టిఎన్‌ఎస్‌ఎఫ్‌, తెలంగాణ జన సమితి, బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా విద్యార్థులు వారి సమస్యల‌ను విద్యార్థి సంఘ నాయకుల‌ దృష్టికి తీసుకొచ్చారు. కళాశాల‌ ప్రారంభమైనప్పటికీ అధ్యాపకులు లేరని కెమిస్ట్రీ, బాటని, ల్యాబ్‌ టెక్నీషియన్‌, ఎంపిహెచ్డబ్ల్యూ కోర్స్‌లో అధ్యాపకులు లేకుండానే కళాశాల‌లు కొనసాగుతున్నాయని తమ జీవితాల‌ను ప్రభుత్వం నాశనం చేస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా విద్యార్థి సంఘ నాయకులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ జూనియర్‌ కళాశాల‌లను సర్వనాశనం చేసిన ఘనత కేసిఆర్‌కే చెందుతుందన్నారు. రాష్ట్రం వస్తే విద్యావ్యవస్థ బాగుపడుతుందని అనుకుంటే మరింత అధ్వాన్న స్థితిలోకి వెళ్లిందని పేర్కొన్నారు. కామారెడ్డి జిల్లాలో 42 మంది అధ్యాపకుల‌ను నియమించకుండానే కళాశాల‌లు ప్రారంభించారని, బంగారు తెలంగాణ పేరుతో తెలంగాణ విద్యార్థుల‌ బతుకుల‌ను ఆగం చేస్తున్నారని తెలిపారు.

ఈ విషయమై జిల్లా వ్యాప్తంగా ఉన్న ఎమ్మెల్యేలు స్పందించాల‌ని, కళాశాల‌ల్లో అధ్యాపకుల‌ను నియమించాల‌ని లేకపోతే విద్యార్థుల‌ సహాయంతో ఆందోళన ఉధృతం చేస్తామన్నారు. కార్యక్రమంలో టీఎన్‌ఎస్‌ఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి బాలు, తెలంగాణ జన సమితి జిల్లా నాయకుడు కుంభాల ల‌క్ష్మణ్‌ యాదవ్‌, బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు నాగరాజు, విద్యార్థులు వసంత, భార్గవి, పూజిత, భవాని, మౌనిక, అనిత, అంజుమ్‌, రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు.

Check Also

హోమ్ ఐసోలేషన్‌కు వసతి లేని వారిని ప్రభుత్వ ఐసొలేషన్‌లో వుంచాలి

కామారెడ్డి, మే 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః పాజిటివ్ కేసులు ఎక్కువగా వస్తున్న ఆరోగ్య కేంద్రాల పరిధిలో ...

Comment on the article