Breaking News

రైతుల‌కు ఇబ్బంది లేకుండా ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయండి

నిజామాబాద్‌, మార్చ్‌ 30

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఉపాధి హామీ పథకం ద్వారా అమలు చేస్తున్న పలు అభివృద్ధి కార్యక్రమాలు ల‌క్ష్యాల‌కు అనుగుణంగా పూర్తి చేయడానికి చర్యలు తీసుకోవడంతో పాటు ఈ సంవత్సరం అన్ని జిల్లాల్లో కూలీల‌కు మంచి పనులు అప్పగించి ఆర్థికంగా పుంజుకోవడానికి కృషిచేసిన కలెక్టర్లను అభినందిస్తున్నానని అదేవిధంగా హరితహారం సమీకృత మార్కెట్లు ధాన్యం కొనుగోలు కేంద్రాలు తదితర అన్ని విషయాల‌పై ప్రత్యేక శ్రద్ధ కనబరచాల‌ని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌ కుమార్‌ జిల్లా కలెక్టర్లను ఆదేశించారు.

మంగళవారం హైదరాబాద్‌ నుండి సంబంధిత శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీలు రాష్ట్ర స్థాయి అధికారుల‌తో పలు అంశాల‌పై కలెక్టర్లు సంబంధిత అధికారుల‌తో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ స్మశాన వాటికలు పల్లె ప్రగతి వనాలు పూర్తి చేయడానికి చర్యలు తీసుకోవాల‌న్నారు.

ఈ సీజన్లో ఉపాధి హామీ కూలీల‌కు పని కల్పించడం అత్యంత ప్రధానమైనదని ఈ దిశగా కూలీల‌కు పనులు కల్పించి వారికి మరింత ఉపాధి ల‌భించే విధంగా చర్యలు తీసుకోవాల‌న్నారు. ఈ సంవత్సరం కూలీల‌కు పెద్ద ఎత్తున పనులు కల్పించి వారికి ఆర్థికంగా వెసులుబాటు కల్పించడం ద్వారా కలెక్టర్లు బాగా కృషి చేశారని ఆయన అభినందించారు. దీని ద్వారా రూరల్‌ ఎకనామి అభివృద్ధి చెందడంతో పాటు శాశ్వత అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయని ఇందులో డంపింగ్‌ యార్డు, రోడ్లు, స్కూల్‌ భవనాలు మరెన్నో కార్యక్రమాలు ఉన్నాయని పేర్కొన్నారు.

ఏ గ్రామంలో కూడా వంద మంది కూలీల‌ కంటే తక్కువ కాకుండా చూడాల‌ని సూచించారు. గత ఐదారు సంవత్సరాలుగా నిర్వహిస్తున్న హరితహారం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా మంచి గ్రీనరీ ఏర్పడిందని ఎండలు తీవ్ర ప్రభావం చూపుతున్నందున హరిత హారంలో నాటిన మొక్కల‌తో పాటు నర్సరీలో పెరుగుతున్న మొక్కల‌కు వెరీ మార్నింగ్‌ వెరీ ఈవెనింగ్‌ నీటిని అందించే విధంగా చర్యలు తీసుకోవాల‌ని తెలిపారు.

వచ్చే సంవత్సరం గృహిణుల‌కు అందించడానికి అవసరమైన గృహ అవసరాల‌ మొక్కల‌ను పంపిణీ చేయడానికి చర్యలు తీసుకోవాల‌న్నారు. ముఖ్యమంత్రి ఆదేశించిన విధంగా జిల్లా కేంద్రాల్లోనూ ఇతర కేంద్రాల్లోనూ సమీకృత కూరగాయల‌ మాంసాహార మార్కెట్లు ఆరు నెల‌ల్లో పూర్తి చేయడానికి అవసరమైన చర్యలు తీసుకోవాల‌ని ఇది ఫ్లాగ్షిప్‌ ప్రోగ్రామ్‌గా గుర్తించాల‌ని తెలిపారు. నిజామాబాద్‌ జిల్లాలో ఆర్మూర్‌, భీమ్‌గల్‌లో ఏర్పాటు చేసే సమీకృత మార్కెట్‌ స్థలాల‌ను ఒకసారి పరిశీలించాల‌ని తెలిపారు.

ఇవి ప్రజల‌కు అందుబాటులో ఉండే విధంగా ఏర్పాటు చేయాల‌న్నారు. ధరణి మ్యుటేషన్లో ఎన్నారౖులు, కంపెనీలు, ఇతరులు పాసు బుక్కు కొరకు 1.8 ల‌క్షల‌ దరఖాస్తులు సమర్పించారని, వీటిలో 1.15 ల‌క్షల‌ దరఖాస్తుల‌ను పరిష్కరించడం జరిగిందని తెలిపారు.

కలెక్టర్ల పరిధిలో సమస్యలు లేని వాటికి వెంటనే చర్యలు తీసుకోవాల‌ని తెలిపారు. కోవిడ్‌ వైరస్‌ బాగా వ్యాప్తి చెందుతున్నదని ఈ దిశగా అన్ని జాగ్రత్త చర్యలు, నివారణ చర్యలు తీసుకోవాల‌ని ఇప్పటికే ప్రభుత్వం పండుగలు, మతపరమైన ఊరేగింపులు ఇతర ఫంక్షన్స్‌ పైన నిబంధనలు విధించిందని అదేవిధంగా మాస్కు లేకుండా బయట తిరిగే వారిపై జరిమానా వేసే విధంగా ఉత్తర్వులు జారీ చేసిందని వైరస్‌ వ్యాప్తిని అరికట్టడానికి అందుబాటులో ఉన్న అన్ని చర్యలు తీసుకోవాల‌ని కోరారు.

యాసంగి ధాన్యం కొనుగోలుకు అవసరమైన యాక్షన్‌ ప్లాన్‌ సిద్ధం చేసుకొని సంబంధిత మంత్రుల‌ను సంప్రదించి కొనుగోలు కేంద్రాల‌ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాల‌ని, గన్ని బ్యాగ్‌ సమస్య రాకుండా చూసుకోవడం ముఖ్యమని, వాటి సరఫరాకు ప్రభుత్వం ఆర్డర్స్‌ చేసిందని తెలుపుతూ ఇందుకుగాను ఎక్కడైనా సమస్యలు ఎదురైతే పరిష్కరించడానికి కంట్రోల్‌ రూమ్‌లు ఓపెన్‌ చేయాల‌ని, కొనుగోలు కేంద్రాల్లో అవసరమైన సదుపాయాలు, తూకం కాంటాలు, రవాణా తదితర ఏర్పాట్లు చూసుకోవాల‌ని, కొనుగోలు చేసిన ధాన్యాన్ని ఆన్‌లైన్‌లో ఎప్పటికప్పుడు నమోదు చేయించడానికి చర్యలు తీసుకోవాల‌ని సూచించారు.

నాణ్యమైన ధాన్యం తెచ్చే విధంగా రైతుల‌కు అవగాహన కల్పించాల‌న్నారు. వీడియో కాన్ఫరెన్సులో జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డి మాట్లాడుతూ సిఎస్‌ ఆదేశం ప్రకారం అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని జిల్లాలో 7 ల‌క్షల‌ మెట్రిక్‌ టన్నుల‌ పైగా ధాన్యం వచ్చే అవకాశం ఉన్నందున అందుకు తగినట్లు ఏర్పాటు చేస్తామని తెలిపారు.

విడియో కాన్ఫరెన్సులో డిఎఫ్‌ఓ సునీల్‌, అదనపు కలెక్టర్‌ చంద్రశేఖర్‌, ల‌త, డిఎం అండ్‌ హెచ్‌వో సుదర్శనం, ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్‌ ప్రతిమ రాజ్‌, డిఆర్‌డిఓ శ్రీనివాస్‌, డిపిఓ జయసుధ, డిఎం సివిల్‌ సప్లయిస్‌ అభిషేక్‌ సింగ్‌, డిసిఎస్‌ఓ వెంకటేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.

Check Also

నా కష్టార్జితం ఇప్పించండి

నిజామాబాద్‌, మే 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : యుఏఇ రాజధాని అబుదాబి లోని తన యాజమాన్య కంపెనీ ...

Comment on the article