కోవిడ్‌ చికిత్సకు ప్రాధాన్యత ఇవ్వాలి

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 9

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కోవిడ్‌ సెకండ్‌ వేవ్‌ మరియు వాక్సినేషన్‌పై నిజామాబాద్‌, కామారెడ్డి జిల్లాల‌ కలెక్టర్లతో, నిజామాబాద్‌ జనరల్‌ హాస్పిటల్‌ సూపరింటెండెంట్‌ తో మంత్రి వేముల‌ ప్రశాంత్‌ రెడ్డి ఫోన్‌లో మాట్లాడారు. కోవిడ్‌ మహమ్మారి మళ్లీ విజృంభిస్తున్న నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల‌పై ప్రజల్లో అవగాహన కల్పించాల‌ని ఈ సందర్బంగా సూచించారు. ఉభయ జిల్లాలోని బోధన్‌, ఆర్మూర్‌, బాన్సువాడ, కామారెడ్డి, ఎల్లారెడ్డి ఏరియా హాస్పిటల్స్‌లో సరిపడా సదుపాయాలు ఏర్పాటు చేయాల‌ని ఉభయ జిల్లా కలెక్టర్లు నారాయణరెడ్డి, డా.శరత్‌ ను మంత్రి ఆదేశించారు.

ముఖ్యంగా పేషంట్‌కి అవసరమయ్యే ట్రీట్‌ మెంట్‌ని బట్టి ముందు ఏరియా హాస్పిటల్‌లో చూడాల‌ని, అత్యవసరమైతే జిల్లా హాస్పిటల్‌లో చికిత్స అందించాల‌ని సూచించారు. ఏ ఏ పేషంట్‌కి ఎక్కడ చికిత్స అందించాలో ముందే అవగాహనకు వచ్చేలా ఒక ప్రోటోకాల్‌ పాటించాల‌ని చెప్పారు. నిజామాబాద్‌ ప్రభుత్వ జనరల్‌ హాస్పిటల్‌లో జనరల్‌ ఓ.పి ని తగ్గించి, కోవిడ్‌ పేషంట్స్‌ చికిత్సకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాల‌ని అన్నారు.

కరోనా టెస్టుల‌ సంఖ్య పెంచాల‌ని అదేవిధంగా సమాంతరంగా కోవిడ్‌ వ్యాక్సినేషన్‌ జరిగేలా చూడాల‌ని ఇరువురు కలెక్టర్లను ఆదేశించారు. ఆర్థిక స్థోమత కలిగి ప్రయివేట్‌ హాస్పిటల్‌లో చికిత్స తీసుకోవాల‌నుకునే వారికి ఆ వెసులుబాటు కల్పించాల‌ని సూచించారు. ప్రైవేట్‌ హాస్పిటల్‌లో ఇబ్బడిముబ్బడిగా బిల్లు‌లు వేయవద్దని, ప్రభుత్వ దృష్టికి వస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జిజిహెచ్‌లో డేటా ఎంట్రీ ఆపరేటర్ల కొరత ఉన్నదని సూపరింటెండెంట్‌ ప్రతిమ రాజ్‌ మంత్రి దృష్టికి తీసుకురాగా తాత్కాలికంగా ఔట్‌ సోర్సింగ్‌ పద్దతిలో డేటాఎంట్రీ ఆపరేటర్‌ను నియమించుకునే అధికారాలు సూపరింటెండెంట్‌కు ఇవ్వాల‌ని జిల్లా కలెక్టర్‌ నారాయణరెడ్డి కి సూచించారు.

కరోనా ప్రబలుతున్న దృష్ట్యా ప్రభుత్వం అన్ని రకాల‌ జాగ్రత్త చర్యలు తీసుకున్నప్పటికీ ప్రజలు కూడా విధిగా స్వీయ నియంత్రణ పాటిస్తూ మాస్క్‌ తప్పనిసరిగా ధరించాల‌ని మంత్రి ఉభయ జిల్లాల‌ ప్రజల‌ను కోరారు.

Check Also

మేడే పోస్టర్ల ఆవిష్కరణ

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : 135 వ మేడే దినోత్సవ పోస్టర్లను జిల్లా కేంద్రంలోని ...

Comment on the article