Breaking News

పెంచిన ఎరువుల ధరల‌ను వెంటనే ఉపసంహరించుకోవాలి

మోర్తాడ్‌, ఏప్రిల్‌ 10

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెంచిన ఎరువుల ధరల‌ను వెంటనే ఉపసంహరించుకోవాల‌ని ఏఐకెఎంఎస్‌ రాష్ట్ర కార్యదర్శి వి.ప్రభాకర్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. మోర్తాడ్‌ మండల‌ కేంద్రంలోని ఏఐకెఎమ్‌ఎస్‌ కార్యాల‌యంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ప్రభాకర్‌ మాట్లాడారు. బిజెపి ప్రభుత్వం రైతుల‌కు అవసరమయ్యే ఎరువుల‌పై రెండు నెల‌ల ముందుగానే ఇష్టానుసారంగా ధరలు పెంచడం ఏమిటని ఆయన ప్రశ్నించారు.

బిజెపి ప్రభుత్వం పక్కా ప్రణాళికతోనే వ్యవసాయ సీజన్‌కు ముందుగానే ఎరువుల ధరలు ప్రస్తుతం ఉన్న ధర కంటే 58 శాతం పెంచి రైతు నడ్డి విరిచే విధంగా చేసిందని ప్రభాకర్‌ ఆవేదన వ్యక్తం చేశారు. రెండు నెల‌ల ముందే ధరలు పెంచి రైతుల‌ను మోసం చేస్తుందని ఎరువుల‌ బస్తాపై ధరలు పెంచి రైతు పెట్టుబడి అధికం చేయడం రైతు వ్యతిరేక చర్య అన్నారు. ఒకవైపు రైతుకు రెండింతలు ఆదాయం తెచ్చి పెడతామని చెప్పిన బిజెపి ప్రభుత్వం ప్రస్తుతం రెండింతలు నష్టం చేయడానికి ఎరువుల ధరలు ఉపయోగ పడతాయని ఎద్దేవా చేశారు.

పెంచిన ఎరువుల ధరల‌ను తక్షణమే తగ్గించకపోతే రైతు ఆందోళనను బిజెపి ప్రభుత్వం చూడక తప్పదన్నారు. కరోనా మహమ్మారి రెండవ దశ విస్తరిస్తున్న సమయంలో రైతులు రోడ్డెక్కరని భావించి ఎరువుల ధరలు పెంచడం అన్యాయమన్నారు.

పెంచిన ధరను వెంటనే ఉపసంహరించుకోవాల‌ని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతుబంధు కిసాన్‌ యోజన పథకాలు ఎడమ చేతితో ఇస్తూ కుడి చేతితో మూడింతలు వసూలు చేయడం కార్పొరేట్‌ శక్తుల‌కు ఊడిగం చేసినట్లవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. సమావేశంలో సురేష్‌ ఏఐకెఎంఎస్‌ జిల్లా ఉపాధ్యక్షుడు, రాజేశ్వర్‌ జిల్లా సహాయ కార్యదర్శి, జి.కిషన్‌ ఆర్మూర్‌ డివిజన్‌ ఉపాధ్యక్షుడు, పిడిఎస్‌యు నాయకురాలు ప్రియాంక తదితరులు పాల్గొన్నారు.

Check Also

22న సర్వసభ్య సమావేశం

మోర్తాడ్‌, మార్చ్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మోర్తాడ్‌ మండల‌ ప్రజా పరిషత్‌ కార్యాల‌యంలో ఈ నెల‌ ...

Comment on the article