మందులు, ఆక్సిజన్‌, ఇంజెక్షన్లు అందుబాటులో ఉండే విధంగా ఏర్పాట్లు

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 17

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కోవిడ్‌ పరీక్షలు పెంచడం, అవసరమైనవారికి చికిత్సలు అందించడం, వైరస్‌ వ్యాప్తి చెందకుండా అవగాహన కల్పించడంతో పాటు అర్హులందరికీ వ్యాక్సినేషన్‌ ఇప్పించడం ద్వారా వైరస్‌పై ప్రజల‌కు రిలీఫ్‌ కల్పించడానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని, అదేవిధంగా వైరస్‌ సోకిన వారికి ఇతర ఏర్పాట్లు చేయడానికి, చికిత్సలు అందించడానికి జిల్లా అధికారుల‌కు ఆదేశాలు జారీ చేశామని రాష్ట్ర రోడ్లు భవనాలు, శాసనసభ వ్యవహారాల‌ శాఖామాత్యులు వేముల‌ ప్రశాంత్‌ రెడ్డి తెలిపారు.

శనివారం కలెక్టరేట్‌లోని ప్రగతి భవన్‌ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్‌ పోలీస్‌ కమిషనర్‌ ఇతర అధికారుల‌తో కోవిడ్‌ వ్యాప్తి తీసుకోవాల్సిన చర్యల‌పై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ జిల్లాలోని 42 కేంద్రాల‌లో పరీక్షలు నిర్వహిస్తున్నామని, రోజుకు 2500 పరీక్షలు ల‌క్ష్యం కాగా ప్రస్తుతం ఐదు వేల‌ వరకు నిర్వహిస్తున్నారని, అందుకు అవసరమైన కిట్స్‌ ఎన్ని అవసరమైతే అన్ని పంపించడానికి రాష్ట్ర స్థాయి అధికారుల‌తో మాట్లాడం ద్వారా వారు అంగీకరించారని తెలిపారు.

పరీక్షలో పాజిటివ్‌ వచ్చినవారికి వ్యాధి తీవ్రతను బట్టి ఆసుపత్రుల‌లోను లేదా క్వారంటైన్‌ కేంద్రాల‌లోనూ చికిత్స అందించడానికి ఏర్పాటు చేయడం జరిగిందని ప్రస్తుతానికి మూడు డివిజన్లలో 3 కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని అవసరాన్ని బట్టి మరో ఆరు కేంద్రాల‌ ఏర్పాటుకు అధికారుల‌కు సూచనలు చేయడం జరిగిందన్నారు.

నిజామాబాద్‌, బోధన్‌, ఆర్మూర్‌ ప్రభుత్వ ఆసుపత్రుల‌లో ప్రస్తుతం 405 ఆక్సిజన్‌తో కూడిన బెడ్స్‌ అందుబాటులో ఉన్నాయని వీటిని 700 వరకు పెంచే విధంగా ఏర్పాటు చేయాల‌ని అధికారుల‌ను ఆదేశించామని మరోవైపు మూడు డివిజన్లలో 70 ప్రైవేటు ఆసుపత్రుల‌లో 1400 వరకు బెడ్స్‌ అందుబాటులో ఉండే విధంగా ఏర్పాటు చేయాల‌ని తెలిపామని ఈ దిశగా చర్యలు తీసుకుంటున్నారని తద్వారా జిల్లాలో మొత్తం రెండు వేల‌ ఒక వంద ఆక్సిజన్‌తో కూడిన బెడ్స్‌ సిద్ధం చేయాల‌ని అధికారుల‌కు సూచించడం జరిగిందన్నారు. ప్రైవేట్‌ ఆస్పత్రిలో ప్రభుత్వ నిర్ణయానికి అనుగుణంగా ఫీజు తీసుకోవాల‌ని లేదంటే అధికంగా వసూలు చేస్తే మంచి మాటతో చెప్పి అయినా వినకుంటే చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

ఈ అన్నింటి కంటే ముందు ప్రజలు వైరస్‌ నుండి తమను తాము రక్షించుకోవడానికి పోలీస్‌, రెవెన్యూ, పంచాయతీ రాజ్‌ శాఖలు అవగాహన కల్పించాల‌ని ముఖ్యంగా మాస్కు లేకుండా బయటకు రావద్దని బయటకు వెళ్ళినప్పుడు శానిటైజర్‌తో చేతులు శుభ్రం చేసుకోవాల‌ని సామాజిక దూరం పాటించాల‌ని అవగాహన కల్పించుటకు సూచించామన్నారు. అదేవిధంగా ఇతర రాష్ట్రాల‌ బార్డర్‌ వద్ద సరైన చెకింగ్‌ చేసి అవసరమైన చర్యలు తీసుకోవాల‌న్నారు.

మాస్క్‌లు లేకుండా బయట తిరిగితే ప్రభుత్వ ఆదేశాల‌ ప్రకారం జరిమానా విధించడం చేయాల‌న్నారు. ఈ అన్ని చర్యల‌తో పాటు 45 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరికి వ్యాక్సినేషన్‌ ఇప్పించే విధంగా చర్యలు తీసుకోవాల‌ని ఫ్రంట్‌ లైన్‌ వర్కర్స్‌ కూడా అందరూ తీసుకోవాల‌ని కోరారు. క్షేత్రస్థాయిలో ఒత్తిడిలో పనిచేసే మీకు ప్రభుత్వం జిల్లా యంత్రాంగం తోడుగా ఉంటుందని అన్ని సమయాల్లో తాను అందుబాటులో ఉంటానని ఏ సమస్య అయినా తన దృష్టికి తీసుకురావాల‌ని అధికారుల‌కు సూచించారు.

అయితే తమ వద్దకు వచ్చే ప్రజల‌కు ధైర్యం చెప్పి వారికి అవసరమైన చికిత్సలు అందించాల‌ని సల‌హాలు‌ సూచనలు చేయాల‌ని తెలిపారు. జిల్లాలో అందుబాటులో ఉన్న మొత్తం 33 అంబులెన్సు పనిచేసే విధంగా చూడాల‌న్నారు. సమీక్షలో జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డి, కమిషనర్‌ ఆఫ్‌ పోలీస్‌ కార్తికేయ, మున్సిపల్‌ కమిషనర్‌ జితేష్‌ వి పాటిల్‌, జిల్లా అధికారు‌లు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, ఆర్‌డివోలు, పోలీస్‌ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Check Also

మేడే పోస్టర్ల ఆవిష్కరణ

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : 135 వ మేడే దినోత్సవ పోస్టర్లను జిల్లా కేంద్రంలోని ...

Comment on the article