Breaking News

పొన్నాల బాల‌య్యకు డాక్టరేట్‌

డిచ్‌పల్లి, మే 2

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాల‌యంలోని హిందీ విభాగపు పరిశోధకులు మరియు ప్రముఖ కవి, రచయిత పొన్నాల బాల‌య్యకు పిహెచ్‌. డి. డాక్టరేట్‌ పట్టా ప్రదానం చేశారు. తెలంగాణ విశ్వవిద్యాల‌యంలోని హిందీ విభాగపు అసోషియేట్‌ ప్రొఫెసర్‌ డా. జి. ప్రవీణా బాయి పర్యవేక్షణలో ‘‘హిందీ – తెలుగు దళిత కవిత్వంలో శిల్పం, అభివ్యక్తీకరణ (2005-2015)’’ అనే అంశంపై పిహెచ్‌. డి. పరిశోధన గావించి సిద్ధాంత గ్రంథాన్ని రూపొందించి తెలంగాణ విశ్వవిద్యాల‌యానికి సమర్పించారు.

అంతర్జాల‌ (వర్చువల్‌) వేదికగా ఏర్పాటు చేయబడిన పిహెచ్‌. డి. ఓపెన్‌ వైవా వోస్‌కు హైదరాబాద్‌ యూనివర్సిటీ నుంచి హిందీ విభాగపు ప్రొఫెసర్‌ ఆచార్య వి. కృష్ణ హాజరై పరిశోధకుడిని పరిశోధనాంశంపై పలు ప్రశ్నలు అడిగి సమాధానాలు రాబట్టారు. వైవా వోస్‌కు ఆర్ట్స్‌ పీఠాధిపతి ప్రొఫెసర్‌ పి. కనకయ్య చైర్మన్‌ గా, బిఓఎస్‌ మహ్మద్‌ జమీల్‌ అహ్మద్‌ కన్వీనర్‌గా వ్యవహరించారు. విభాగాధిపతి డా. వి. పార్వతి, తదితర అధ్యాపకులు, పరిశోధకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

పొన్నాల బాల‌య్య సిద్దిపేట జిల్లా కోహెడ మండలం ఆరెపల్లి గ్రామంలో ఒక నిరుపేద దళిత కుటుంబంలో జన్మించారు. తల్లిదండ్రులు కొమరమ్మ దుర్గయ్యలు. బాల్యంలోనే తల్లిదండ్రుల‌ను కోల్పోయి ఒక అనాధగా ఒంటరి జీవితాన్ని అనుభవించారు. కూలి నాలి చేస్తూ ఒక పక్క చదువుకుంటూనే బొంబాయికి వల‌సపోయాడు. తిరిగి వచ్చి అంబేద్కర్‌ ఆశయాల‌ ప్రభావంతో కష్టపడి చదువుకొని ఉపాధ్యాయ వృత్తిలో నియమితులైనారు.

ప్రస్తుతం జెడ్‌పిహెచ్‌ఎస్‌ శ్రీరాముల‌పల్లి మండలం కోహెడ జిల్లా సిద్దిపేటలో హిందీ భాషోపాధ్యాయునిగా విధులు నిర్వహిస్తున్నారు. దాదాపు 20 సంవత్సరాల‌ నుంచి ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగుతున్నారు. పొన్నాల బాల‌య్య ప్రముఖ దళిత కవి, రచయిత కూడా. గోరి (కథలు), ఎగిలివారంగ, పో (ఇగ పొత్తు క‌ల్వ‌ది), దందెడ, మిగ్గు, ంద (నవల‌) వంటివి రచించారు. ఉపాధ్యాయ వృత్తికి, సాహిత్య సేవకు గాను వారు అనేక పురస్కారాల‌ను పొందారు.

తెలంగాణ సాహిత్య అకాడమీ నవలా పురస్కారం 2018, డా. సి.నా.రె. పురస్కారం 2017, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాల‌యం ఉత్తమ కవిత్వం సాహిత్య పురస్కారం 2012, జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం 2010, తెలంగాణ ఆత్మ బంధువు పురస్కారం 2010, జన జాగృతి పురస్కారం 2010, అంబేడ్కర్‌ పెలోషిఫ్‌ 2009 వంటి తదితర అవార్డులు, రివార్డులు సాధించారు.

కెమిస్ట్రీలో ఆర్‌. హనుమాండ్లుకు డాక్టరేట్‌ ప్రదానం

తెలంగాణ విశ్వవిద్యాల‌యంలోని ఆర్గానిక్‌ కెమిస్ట్రీ విభాగంలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ బిఓఎస్‌ డా. బి. సాయిలు పర్యవేక్షణలో పరిశోధక విద్యార్థి ఆర్‌. హనుమాండ్లు ‘‘సింథెసిస్‌ అండ్‌ బయోలాజికల్‌ ఆక్టివిటీ ఆఫ్‌ నావెల్‌ హెటిరో ఫూసుడ్‌ ట్రిప్లోరోమైతిల్‌ పైరిడైన్‌ డెరివటీవ్స్‌’’ అనే అంశంపై పరిశోధన చేసి సిద్ధాంత గ్రంథం రూపొందించారు.

ఓపెన్‌ వైవా వోస్‌ (వర్చువల్‌) కు జెఎన్‌టియూ హైదరాబాద్‌ నుంచి ప్రొఫెసర్‌ ఎం. తిరుమల‌ చారి ఎక్స్‌టర్నల్‌ ఎగ్జామినర్‌గా హాజరైనారు. వైవా వోస్‌ కు సైన్స్‌ డీన్‌ అచార్య బి. విద్యావర్థిని చైర్మన్‌గా వ్యవహరించారు. విభాగాధిపతి డా. బాల‌కిషన్‌, అసోషియేట్‌ ప్రొఫెసర్‌ డా. నాగరాజు, తదితర అధ్యాపకులు, పరిశోధకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

బిజినెస్‌ మేనేజ్‌ మెంట్‌లో డి.వాసంతికి డాక్టరేట్‌ ప్రదానం

తెలంగాణ విశ్వవిద్యాల‌యంలోని బిజినెస్‌ మేనేజ్‌ మెంట్‌ విభాగంలో ప్రొఫెసర్‌ కైసర్‌ మహ్మద్‌ పర్యవేక్షణలో పరిశోధక విద్యార్థి డి. వాసంతి ‘‘ఎ కంపారిటీవ్‌ స్టడీ ఆఫ్‌ ఆర్గనైజేషన్‌ సిటిజెన్‌ షిప్‌ బిహేవియర్‌ ఇన్‌ సెలెక్ట్‌ సర్వీస్‌ సెక్టార్‌’’ అనే అంశంపై పరిశోధన చేసి సిద్ధాంత గ్రంథం రూపొందించారు. ఓపెన్‌ వైవా వోస్‌ (వర్చువల్‌) కు ఎక్స్‌ టర్నల్‌ ఎగ్జామినర్‌ విచ్చేసి పలు ప్రశ్నలు అడిగి సమాధానాలు రాబట్టారు. వైవా వోస్‌కు కామర్స్‌, బిజినెస్‌ మేనేజ్‌ మెంట్‌ డీన్‌ ఆచార్య ఎం. యాదగిరి చైర్మన్‌గా, బిఓఎస్‌ డా. వాణి కన్వీనర్‌గా వ్యవహరించారు. విభాగాధిపతి డా. రాజేశ్వరి, అధ్యాపకులు డా. అపర్ణ, డా. ఆంజనేయులు, తదితర అధ్యాపకులు, పరిశోధకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

పొన్నాల బాల‌య్య, ఆర్‌. హనుమాండ్లు, డి. వాసంతి పిహెచ్‌. డి. సాధించడం పట్ల ఉపకుల‌పతి నీతూ కుమారి ప్రసాద్‌, రిజిస్ట్రార్‌ ఆచార్య నసీం, ప్రిన్సిపల్‌ డా. వాసం చంద్రశేఖర్‌, కంట్రోల‌ర్‌ డా. పాత నాగరాజు, పిఆర్‌ఓ డా. వంగరి త్రివేణి, తదితర అధ్యాపకులు, పరిశోధకులు, విద్యార్థులు శుభాభినందనలు తెలిపారు.

Check Also

ఘనంగా ఎన్‌.ఎస్‌.యూ.ఐ ఆవిర్భావ వేడుకలు

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శుక్రవారం నిజామాబాద్‌ నగరం కాంగ్రెస్‌ భవన్‌లో ఎన్‌.ఎస్‌. యూ.ఐ ...

Comment on the article