Breaking News

ఇంటింటి సర్వేకు కుటుంబ సభ్యులందరూ పాల్గొనాలి

నిజామాబాద్‌, మే 12

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు ఆదేశాల‌ మేరకు కోవిడ్‌ నివారణకు తీసుకున్న చర్యల‌వ‌ల్ల‌ వ్యాప్తి 25 నుండి 15 శాతానికి తగ్గిందని, మరణాల‌ రేటు కూడా తగ్గిందని ఇందుకు కృషి చేసిన వైద్య ఆరోగ్య శాఖ డాక్టర్లకు, సిబ్బందికి అభినందనలు తెలియ చేస్తున్నానని, అదేవిధంగా ఇందుకు సహకరించిన రెవిన్యూ, పోలీస్‌ అధికారుల‌కు కూడా కృతజ్ఞతలు తెలియ చేస్తున్నానని రాష్ట్ర శాసనసభ వ్యవహారాలు రోడ్లు భవనాల‌ శాఖామాత్యులు వేముల‌ ప్రశాంత్‌ రెడ్డి అన్నారు. బుధవారం ప్రగతి భవన్‌ సమావేశ మందిరంలో కోవిడ్‌ వ్యాప్తి నివారణకు తీసుకున్న చర్యలు, లాక్‌ డౌన్‌ ధాన్యం కొనుగోలు తదితర విషయాల‌పై జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డి, రూరల్‌ శాసనసభ్యులు బాజిరెడ్డి గోవర్ధన్‌, మున్సిపల్‌ కమిషనర్‌ జితేష్‌, ఇతర సంబంధిత అధికారుల‌తో సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జిల్లా యంత్రాంగం కరోనా వ్యాధి వ్యాప్తిని అరికట్టడానికి తీసుకున్న చర్యలు సత్ఫలితాలు ఇచ్చాయని పాజిటివ్‌ రేటు బాగా తగ్గిందని తెలిపారు. వైరస్‌ బాగా వ్యాప్తి జరుగుతున్న సమయంలో వంద మందికి పరీక్షలు నిర్వహించగా 25 మందికి పాజిటివ్‌ వచ్చిందని యంత్రాంగం తీసుకున్న చర్యల వ‌ల్ల‌ ప్రస్తుతం అది 15 కు తగ్గిందని తెలిపారు. వైరస్‌ నివారణకు చర్యలు తీసుకోవడానికి ముందు ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులో 1000 లోపు పడకలు ఉండేవని వాటిని ఇరవై రెండు వందల‌కు పెంచుకున్నామని తద్వారా వ్యాధిగ్రస్తుల‌కు వైద్యం అందించడానికి వీలు అయిందని తెలిపారు.

అదేవిధంగా ఆక్సిజన్‌ సిలిండర్లు రోజుకు 265 ఉపయోగించగా ప్రస్తుతం 1200 సిలిండర్లు ఉపయోగిస్తున్నారని, రెమిడెసివిర్‌ ఇంజక్షన్లు ఏప్రిల్ నెల‌లో 16000 అందించామని ప్రభుత్వ ఆసుపత్రిలో 4000 స్టాక్‌లో ఉన్నాయని జిల్లాలో ప్రస్తుతం ఇంజక్షన్‌ కు ఇబ్బంది లేదన్నారు. మరింత బాగా సేవలందించడానికి ప్రభుత్వ ఆసుపత్రిలో 310 మందిని వివిధ రకాల‌ పోస్టుల‌లో తాత్కాలికంగా నియామకం చేశామని ఇందులో 49 మంది స్టాఫ్‌ నర్సు, ఏడుగురు ల్యాబ్‌ టెక్నీషియన్‌ 250 మంది పారిశుద్ధ కార్మికులు ఐదుగురు డాటా ఎంట్రీ ఆపరేటర్‌ల‌ను నియమించామని తెలిపారు. మంగళవారం ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో కమిటీ తీసుకున్న నిర్ణయం మేరకు తాత్కాలికంగా ఏఎన్‌ఎంలు ఆశా వర్కర్ ల‌ను మూడు నెల‌ల వరకు నియామకం చేసుకోవాల‌ని ఆదేశించారు.

ముఖ్యమంత్రి నిర్ణయం మేరకు వైద్య సిబ్బంది చేత వ్యాధి ల‌క్షణాలు ఉన్న వివరాల‌ను సేకరించడానికి జిల్లాలోని నాలుగు ల‌క్షల‌ పైగా కుటుంబాల‌కు గాను మూడు ల‌క్షల‌ 59 వేల‌ కుటుంబాల‌లో ఇంటింటి సర్వే నిర్వహించి 7426 మందికి ల‌క్షణాలు ఉన్నట్లు గుర్తించి వారికి మందుల‌ కిట్స్‌ పంపిణీ చేశామని ఈ ప్రయోగం రాష్ట్ర స్థాయిలో కూడా అమలు చేయడానికి ఆలోచిస్తున్నారని పేర్కొన్నారు. అయితే ఆయా కుటుంబాల‌లోని సభ్యులందరూ కూడా వారి వివరాల‌ను స్వయంగా ఇంటికి వచ్చిన వైద్య సిబ్బందికి తెలియ చేయాల‌ని కోరారు.

రాష్ట్ర ప్రభుత్వం కరోనా వ్యాప్తిని అరికట్టడానికి తీసుకున్న లాక్‌ డౌన్‌ చర్యల‌ను పక్కాగా అమలు చేయడానికి ప్రజలు సహకరించాల‌ని తద్వారా మనమంతా త్వరలోనే వైరస్‌ నుండి బయటపడగుగుతామని కోరారు. ప్రతిరోజు ఉదయం 6 గంటల‌ నుండి 10 గంటల‌ వరకు అన్ని రకాల‌ దుకాణాలు తెరిచే ఉంటాయి కాబట్టి వస్తువుల‌ కొరకు ఇబ్బంది పడవద్దని ఆయన ప్రజల‌కు సూచించారు. ప్రతి ఒక్కరు కూడా కోవిడ్‌ నిబంధనల‌ను ఖచ్చితంగా పాటించడం ద్వారా ఎవరికి వారు రక్షణ పొందగలుగుతారు అని సూచించారు.

వ్యవసాయ పనుల‌కు ఆరోగ్యం కొరకు అత్యవసర వస్తువుల‌కు కరెంటు పారిశుద్ధ్యం కార్యక్రమాల‌కు ఎటువంటి ఆటంకం లేదని తెలిపారు. రైతులు సడలింపు సమయంలోనే వ్యవసాయ వస్తువుల‌ను కొనుగోలు చేసుకోవాల‌ని సూచించారు. జిల్లాలో 433 కొనుగోలు కేంద్రాల‌ ద్వారా 4.48 మెట్రిక్‌ టన్నుల‌ వరి ధాన్యాన్ని సేకరించామని మొత్తంగా 6.68 ల‌క్షల‌ మెట్రిక్‌ టన్నులు ధాన్యం వస్తుందని అంచనాగా ఉందన్నారు. ఇప్పటికే 4.38 ల‌క్షల‌ మెట్రిక్‌ టన్నులు ధాన్యాన్ని రైతు మిత్రుల‌కు పంపామని, రూ. 842 కోట్ల విలువకు గాను ఇప్పటికీ 498 కోట్లు రైతుల‌కు చెల్లించాల‌ని మంత్రి వివరించారు.

ధాన్యం సేకరణలో రైతుల‌కు డబ్బు చెల్లించడంలో మన జిల్లా ప్రథమ స్థానంలో ఉన్నదని సగటులో రెండో స్థానంలో ఉన్నదని తెలిపారు. సమస్యను అధిగమించి కొనుగోలును మరింత వేగవంతం చేయాల‌ని ఆయన అధికారుల‌ను ఆదేశించారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు చంద్రశేఖర్ ల‌త, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు సివిల్‌ సప్లయిస్‌ వ్యవసాయ సహకార మెప్మా తదితర శాఖల‌ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Check Also

కోవిడ్‌ పేషంట్‌ల‌తో మాట్లాడిన కలెక్టర్‌

నిజామాబాద్‌, మే 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆరోగ్య కార్యకర్తలు మీ ఇంటికి ప్రతిరోజు వస్తున్నారా మీకు ...

Comment on the article