Breaking News

స్కానింగ్‌ ఫీజు రూ. 2 వేల‌కు అంగీకారం

నిజామాబాద్‌, మే 16

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పేషంట్ల నుండి స్కానింగ్‌ చేసినందుకుగాను ఫీజు కింద 4, 5 వేల‌ రూపాయల‌కు బదులు రూ. 2000 తీసుకోవడానికి సంబంధిత యాజమాన్యాలు అంగీకరించినట్లు జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డి తెలిపారు. రాష్ట్ర మంత్రివర్యులు వేముల‌ ప్రశాంత్‌ రెడ్డి సూచన మేరకు కలెక్టర్‌ ఆదివారం తన చాంబర్లో ఐఎంఏ ప్రతినిధులు, స్కానింగ్‌ సెంటర్ల యాజమాన్యాల‌తో తన చాంబర్లో సమావేశం ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ కరోనా నేపథ్యంలో లేబరేటరీలు ఆసుపత్రుల‌ ప్రజల‌కు మంచి సేవలు అందిస్తున్నాయని తెలిపారు. వ్యాధి తీవ్రతను ఇతర వ్యాధుల‌ వివరాల‌ను ధృవీకరించు కోవడానికి స్కానింగ్‌ చాలా ముఖ్యమైనదని అయితే ఇందుకుగాను సంబంధిత యాజమాన్యాలు రూ. 4000, రూ. 5000 ఫీజు వసూలు చేస్తున్నట్టు ఫిర్యాదులు వస్తున్నాయని ఆయన వారి ద ృష్టికి తీసుకువచ్చారు. నిబంధనలు, ప్రభుత్వ ఉత్తర్వులు ఏ విధంగా ఉన్నప్పటికీ ప్రజలందరినీ ముఖ్యంగా పేద, మధ్యతరగతి ప్రజల‌ను చాలా సమస్యల‌కు, దుఃఖానికి కారణమవుతున్న కరోనా వైరస్‌ దృష్టిలో పెట్టుకొని మానవతా ద ృక్పథంతో ఫీజుల‌ను రెండు వేల‌ రూపాయల‌కు పరిమితం చేసుకోవాల‌ని ఫిలిం, రిపోర్టు రెండు కూడా బాధితుల‌కు అందించాల‌ని ఆయన కోరారు.

అందుకు సంబంధిత యాజమాన్యాలు డాక్టర్లు అంగీకరించారు. మంత్రి, కలెక్టర్‌ సూచించిన మేరకు రెండు వేల‌ రూపాయల‌కే స్కానింగ్‌ చేస్తామని వారు తెలిపారు. అదేవిధంగా జిల్లాలో రెమ్డెసివిర్‌ ఇంజక్షన్లు, ఆక్సిజన్‌ అవసరం మేరకు సరఫరా జరిగే విధంగా చర్యలు తీసుకుంటున్నామని తద్వారా జిల్లాలో వీటి కొరత లేదని ఆయన పేర్కొన్నారు. వీటి వినియోగంపై సంబంధిత ఆసుపత్రుల‌ యాజమాన్యాలు అన్ని వివరాలు అందించి ఇండెంట్‌ పెట్టి వాటిని తీసుకోవాల‌ని ఆయన సూచించారు. అదేవిధంగా ప్రాణాల‌ను కాపాడే వెంటిలేటర్‌ ఆక్సిజన్‌తో రోగుల‌కు చికిత్సలు అందించినప్పుడు ఫీజులు తీసుకునే సమయంలో కూడా కొంత మానవత్వాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాల‌ని ప్రజలు గుర్తుంచుకుంటారని ఆయన కోరారు.

విపత్కర పరిస్థితుల్లో కరోనా పేషెంట్లను వారి బంధువుల‌కు ఎంత సహాయం చెయ్యగలిగితే అంతగా పుణ్యం చేసిన వారే అవుతారని మానవతా కోణంలో చూడాల‌ని ఆయన కోరారు. సమావేశంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. బాల‌ నరేంద్ర, ఐఎంఎ రాష్ట్ర అధ్యక్షుడు రవీందర్‌ రెడ్డి, జిల్లా అధ్యక్షుడు జీవన్‌ రెడ్డి, ప్రతినిధులు రవీంద్రనాథ్‌ సూరి, డిప్యూటీ డిఎమ్‌ హెచ్‌ఓ తుకారాం డిఈఎంఓ గంగాధర్‌ స్కానింగ్‌ కేంద్రాల‌ యాజమాన్యాలు తదితరులు పాల్గొన్నారు.

Check Also

కోవిడ్‌ పేషంట్‌ల‌తో మాట్లాడిన కలెక్టర్‌

నిజామాబాద్‌, మే 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆరోగ్య కార్యకర్తలు మీ ఇంటికి ప్రతిరోజు వస్తున్నారా మీకు ...

Comment on the article