Breaking News

ల‌క్షణాలు ఉన్న వారు మందుల‌ కిట్‌ తీసుకోవాలి

నిజామాబాద్‌, మే 19

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కోవిడ్‌ వైరస్‌ పై ఇంటింటి సర్వేలో భాగంగా వైద్య సిబ్బంది వచ్చినప్పుడు వారి ఆరోగ్య వివరాలు తెలియజేసి ల‌క్షణాలు ఉన్నట్లయితే మందుల‌ కిట్లు తీసుకొని వాటిని వాడుకోవాల‌ని తద్వారా వైరస్‌ నుండి బయటపడాల‌ని జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డి కోరారు. బుధవారం కలెక్టర్‌, నగర మేయర్‌ నీతూ కిరణ్‌, మున్సిపల్‌ కమిషనర్‌ జితేష్‌ వి పాటిల్‌తో కలిసి 35, 36 డివిజన్ల పరిధిలోని నాందేవ్‌వాడలో పర్యటించారు. ఇంటింటి సర్వే కొనసాగుతున్న తీరును పరిశీలించారు. కోవిడ్ ల‌క్షణాలున్న ప్రజల‌తో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా జిల్లాలోని 4 ల‌క్షల‌ ఎనిమిది వేల‌ గృహాల‌లో మొదటి విడత 1204 టీంల‌తో ఇంటింటి సర్వే నిర్వహించగా 7,500 మందికి ల‌క్షణాలు ఉన్నట్లు గుర్తించడం జరిగిందని వారందరికీ కూడా మందుల‌ కిట్లు అందించడం జరిగిందని వారు కోలుకుంటున్నారని వివరించారు. అదేవిధంగా రెండో విడత సర్వే కూడా గత సోమవారం నుండి ప్రారంభించామని సర్వేలో ఇప్పటికీ 30 మందికి ల‌క్షణాలు ఉన్నట్లు గుర్తించామని తెలిపారు.

కరోనా ల‌క్షణాలున్నట్లు ఎవరికైనా అనుమానాలుంటే భయపడకుండా ఏఎన్‌ఎంలు, ఆశా వర్కర్లు, లేదా అంగన్వాడి టీచర్ల దృష్టికి తీసుకు రావాల‌ని, వారిచ్చే మందుల‌ను వారి సూచనల‌ మేరకు వాడడం ద్వారా 95 శాతం ప్రజల‌కు వైరస్‌ నుండి నయమవుతుందని తెలిపారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు కూడా ఓ.పి సేవ‌లు ప్రారంభించామని తెలిపారు. నగర మేయర్‌ మాట్లాడుతూ, నగరంలోని అన్ని డివిజన్లలో సర్వే కోసం టీంలు పర్యటిస్తూ ల‌క్షణాల‌ను నమోదు చేస్తున్నారని వారి వివరాల‌ ప్రకారం తదుపరి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.

Check Also

కోవిడ్‌ పేషంట్‌ల‌తో మాట్లాడిన కలెక్టర్‌

నిజామాబాద్‌, మే 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆరోగ్య కార్యకర్తలు మీ ఇంటికి ప్రతిరోజు వస్తున్నారా మీకు ...

Comment on the article