Breaking News

ఫాకల్టీ ఆఫ్‌ ఆర్ట్స్‌ డీన్‌గా ఆచార్య అత్తర్‌ సుల్తానా

డిచ్‌పల్లి, మే 21

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాల‌యంలోని ఉర్దూ విబాగాధిపతి ఆచార్య అత్తర్‌ సుల్తానా ఫాకల్టీ ఆఫ్‌ ఆర్ట్స్‌ డీన్‌ (పీఠాధిపతి)గా నియమితుల‌య్యారు. ఉపకుల‌పతి, సీనియర్‌ ఐఎఎస్‌ నీతూ కుమారి ప్రసాద్‌ అదేశానుసారం రిజిస్ట్రార్‌ ఆచార్య నసీం గురువారం సాయంత్రం ఫాకల్టీ ఆఫ్‌ ఆర్ట్స్‌ డీన్‌ (పీఠాధిపతి) ఉత్తర్వుల‌ను ఆచార్య అత్తర్‌ సుల్తానాకు అందజేశారు. ఆచార్య అత్తర్‌ సుల్తానా 2008 లో తెలంగాణ విశ్వవిద్యాల‌యంలో ఉర్దూ విభాగంలో అధ్యాపకురాలిగా నియమితులై విభాగాధిపతిగా, పాఠ్య ప్రణాళికా సంఘ చైర్‌ పర్సన్‌గా అకడమిక్‌ బాధ్యతలు నిర్వహించారు.

వారు ఇదివరకు అనేక పాల‌నా పరమైన పదవులు నిర్వర్తించారు. సిడిఇ డైరెక్టర్‌గా, అడ్మిషన్స్‌ డైరెక్టర్‌గా, ఐక్యూ ఎసి డైరెక్టర్‌గా, విశ్వవిద్యాల‌య కళాశాల‌ ప్రిన్సిపల్‌గా బాధ్యతలు నిర్వహించారు. అనేక కళాశాల‌లకు గవర్నింగ్‌ బాడి మెంబర్‌గా, అనేక రాష్ట్ర, జాతీయ స్థాయి కమిటీల‌కు మెంబర్‌గా నియమితుల‌య్యారు. 2011 లో రాష్ట్రీయ గౌరవ్‌ అవార్డు, 2012 లో ఉత్తమ అధ్యాక అవార్డు, 2015 లో ఉత్తమ సాహిత్య కారిణి అవార్డును సాధించారు. ఎం.ఫిల్‌., పిహెచ్‌.డి. తో పాటు ఆరు పుస్తకాల‌ను ముద్రించారు. ఉర్దూ అకాడమి ద్వారా పాఠ్యపుస్తకాల‌లో ఉర్డూ పాఠాల‌ను రచించారు.

వివిధ జాతీయ, అంతర్జాతీయ ఉర్దూ సాహిత్య పత్రికల‌లో దాదాపు 60 కి పైగా పరిశోధక వ్యాసాల‌ను ప్రచురించారు. తెలంగాణ విశ్వవిద్యాల‌యంలో అనేక జాతీయ, అంతర్జాతీయ ఉర్దూ సదస్సులు, ఉర్దూ ఫెస్టివెల్స్‌ నిర్వహించారు. డిపార్ట్‌ మెంటల్‌ మీటింగ్స్‌, సెల‌బస్‌ మీటింగ్స్‌ నిర్వహించి డిగ్రీ స్థాయి నుంచి లాంగ్వేజ్‌ను ప్రోత్సహిస్తూ వస్తున్నారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అనేక సదస్సుల‌లో పరిశోధనా పత్రాలు సమర్పించారు.

అందులో భాగంగానే 2014 లో అమెరికా దేశానికి ఆహ్వానింపబడి వర్జీనియాలో ఉర్దూ సాహిత్య ప్రసంగం చేశారు. ప్రస్తుతం తనను ఫాకల్టీ ఆఫ్‌ డీన్‌గా నియమించినందుకు ఉపకుల‌పతి, రిజిస్ట్రార్‌కు ధన్యవాదాలు తెలిపారు. భాషా విభాగాల్లో పరిశోధనా పరమైన ప్రోత్సాహాన్ని అందిస్తానని తెలిపారు. ఆచార్య అత్తర్‌ సుల్తానా ఫాకల్టీ ఆఫ్‌ ఆర్ట్స్‌ డీన్‌ కావడం పట్ల ఉపకుల‌పతి నీతూ కుమారి ప్రసాద్‌, రిజిస్ట్రార్‌ ఆచార్య నసీం తదితర అధ్యాపకులు, అధ్యాపకేతరులు, పరిశోధకులు, విద్యార్థులు శుభాభినందనలు తెలిపారు.

Check Also

ఘనంగా ఎన్‌.ఎస్‌.యూ.ఐ ఆవిర్భావ వేడుకలు

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శుక్రవారం నిజామాబాద్‌ నగరం కాంగ్రెస్‌ భవన్‌లో ఎన్‌.ఎస్‌. యూ.ఐ ...

Comment on the article