Breaking News

లాక్‌డౌన్‌ పరిశీలించిన జిల్లా కలెక్టర్‌

కామరెడ్డి, మే 25

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలో లాక్‌ డౌన్ అమలుతీరును జిల్లా కలెక్టర్‌ శరత్‌ మంగళవారం పరిశీలించారు. పాత బస్టాండ్‌, రైల్వే స్టేషన్‌, సిరిసిల్ల‌ రోడ్డు సందర్శించారు. రైల్వే స్టేషన్లో ప్రయాణికులు మాస్కులు తప్పనిసరిగా ధరించాల‌ని సూచించారు. భౌతిక దూరం పాటిస్తూ ప్రయాణికులు కూర్చునే విధంగా చూడాల‌ని రైల్వే స్టేషన్‌ మాస్టర్‌ సత్యంను ఆదేశించారు. నిబంధనలు కచ్చితంగా పాటించాల‌ని కోరారు.

ప్రయాణికుల‌ను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంటింటా జ్వరం సర్వే, లాక్‌ డౌన్‌ ద్వారా కరోనా కేసులు రోజురోజుకు తగ్గుముఖం పడుతున్నాయని తెలిపారు. రెవిన్యూ, పోలీస్‌, వైద్య శాఖ సమన్వయంతో పని చేయడం వ‌ల్ల‌ కరోనా కట్టడి సాధ్యమవుతుందని పేర్కొన్నారు. పట్టణంలో పోలీస్‌ శాఖ ఆధ్వర్యంలో 15 చెక్‌ పోస్టులు ఏర్పాటు చేసి కట్టడి చేస్తున్నామని చెప్పారు. మహారాష్ట్ర సరిహద్దులోని మద్నూర్‌, కర్ణాటక సరిహద్దులోని సోంపూర్‌ వద్ద చెక్‌ పోస్టులు ఏర్పాటు చేయడం వ‌ల్ల‌ ఇతర రాష్ట్రాల‌ ప్రజలు మన జిల్లా కి రావడం లేదన్నారు.

సరిహద్దులో ఉన్న 16 గ్రామాల్లో కరోనా కేసులు లేవని పేర్కొన్నారు. కామారెడ్డి, బాన్సువాడ, ఎల్లారెడ్డి వంటి పట్టణాల్లో కొన్ని కరోనా కేసులు ఇప్పుడు వస్తున్నాయని వాటిని కూడా పూర్తిగా తగ్గించే విధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. కరోనా రహిత గ్రామాలుగా ప్రస్తుతం పల్లెలు మారుతున్నాయని చెప్పారు. కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో కరోనా రోగుల‌ కోసం 327 బెడ్స్‌ ఏర్పాటు చేశామని తెలిపారు. ప్రస్తుతం 80 బెడ్లలో రోగులు ఉన్నారని, మిగతావి ఖాళీగా ఉన్నాయని పేర్కొన్నారు. గ్రామాల‌ ప్రజలు స్వచ్ఛందంగా కంచెలు వేసుకొని కోవిడ్‌ నిబంధనలు పాటిస్తూ కరోనాను రూపుమాపడానికి కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. ఆర్డిఓ శీను, తహసిల్దార్‌ ప్రేమ్‌ కుమార్‌, అధికారులు పాల్గొన్నారు.

Check Also

మానవత్వాన్ని చాటిన రక్తదాత లావణ్య

కామారెడ్డి, మే 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రం దేవునిపల్లి గ్రామానికి చెందిన ఈశ్వరయ్య ...

Comment on the article