Breaking News

నిజామాబాద్ లో బ్లాక్ ఫంగస్‌కు చికిత్స,

నిజామాబాద్‌, మే 27

నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః జిల్లాలో కరోనా వైరస్ తగ్గుతూ వస్తున్నదని, బ్లాక్ ఫంగస్ కు నిజామాబాద్ లోనే చికిత్స చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నామని, 6 వేల మంది సూపర్ స్పైడర్ లకు 28, 29 తేదీలలో వ్యాక్సిన్ వేస్తున్నామని, కోవిడ్ విషయములో ప్రజలు భయాందోళనకు గురి కావాల్సిన అవసరం లేదని రాష్ట్ర రోడ్లు భవనాలు, శాసనసభ వ్యవహారాల శాఖామాత్యులు వేముల ప్రశాంత్ రెడ్డి తెలిపారు.

గురువారం కలెక్టర్ చాంబర్లో జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి, కమిషనర్ ఆఫ్ పోలీస్ కార్తికేయ మున్సిపల్ కమిషనర్ జితేష్ వి పాటిల్, అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో కోవిడ్ పై సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులలో కలిపి కేవలం 374 మంది పేషెంట్లు మాత్రమే ఉన్నారని, చాలా బెడ్స్ ఖాళీగా ఉన్నాయని పాజిటివ్ శాతం కూడా 8 కి పడిపోయిందని, దీనిని బట్టి జిల్లాలో కరోనా తగ్గుముఖం పట్టినట్లు అర్థమవుతుందని సంతృప్తి వ్యక్తం చేశారు. అధికారుల ముఖాల్లో వెలుగు కూడా ఈ విషయాన్ని తెలియజేస్తున్నదన్నారు. ప్రతిరోజు నిర్వహించే టెస్టులలో, ఇంటింటి సర్వే లో కలిపి పాజిటివ్ రేటు 8 శాతానికి పడిపోయిందని వివరించారు.

బ్లాక్ ఫంగస్ సోకిన వారు హైదరాబాద్ వెళ్లే అవసరం లేకుండా నిజామాబాదు లోని ప్రభుత్వ ఆస్పత్రిలో 50 పడకలతో ప్రత్యేక వార్డును ఏర్పాటు చేస్తున్నామని అందులో అవసరమైన అన్ని సదుపాయాలు సమకూర్చడంతో పాటు చికిత్సకు అవసరమైన మందులు రాగానే చికిత్సలు ప్రారంభిస్తామని తెలిపారు. ప్రజలు భయపడవలసిన అవసరం లేదని ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్లకుండా ప్రభుత్వ ఆస్పత్రిలోనే చికిత్సలు తీసుకోవాలని ఆయన కోరారు. ఈ చికిత్సకు ఉపయోగించే ఇంజక్షన్లు, మందులకు ఒక్కొక్క పేషెంట్‌కు కనీసం రెండున్నర లక్షలు పైగా ఖర్చు కానున్నట్లు పేర్కొన్నారు.

ప్రజలలో ఎక్కువగా తిరిగే, ప్రజలు ఎక్కువగా వారి వద్దకు వచ్చే 6000 సూపర్ స్ప్రెడర్లకు శుక్రవారం, శనివారం ప్రత్యేకంగా కేంద్రాలు ఏర్పాటు చేసి వ్యాక్సిన్ అందిస్తున్నామని తద్వారా వారి వద్దకు వచ్చే ప్రజలతోపాటు వారు కలిసే ప్రజలకు, వారి కుటుంబ సభ్యులకు వైరస్ నుండి దూరంగా ఉంచే అవకాశం ఏర్పడుతుందన్నారు.

సమీక్షలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి బాల నరేంద్ర, ప్రభుత్వ, ఏరియా ఆసుపత్రుల సూపరింటెండెంట్స్, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, జిల్లా పంచాయతీ అధికారి జయసుధ తదితరులు పాల్గొన్నారు.

Check Also

కోవిడ్‌ పేషంట్‌ల‌తో మాట్లాడిన కలెక్టర్‌

నిజామాబాద్‌, మే 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆరోగ్య కార్యకర్తలు మీ ఇంటికి ప్రతిరోజు వస్తున్నారా మీకు ...

Comment on the article