Breaking News

వానాకాలం సాగుకు అన్ని ఏర్పాట్లు చేసుకోండి

నిజామాబాద్‌, మే 29

నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః జూన్ మొదటి వారంలో వర్షాలు ప్రారంభమయ్యే అవకాశం ఉన్నందున రైతులు వానకాలం పంటల సాగుకు ఏర్పాట్లు చేసుకుంటారని అందుకు అనుగుణంగా విత్తనాలు, ఎరువులు పూర్తిస్థాయిలో అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు.

శనివారం వ్యవసాయ, మార్కుఫెడ్ , సహకార, ఇతర అధికారులతో వానాకాలం సాగుపై సెల్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అంచనాలు, లక్ష్యాలకు అనుగుణంగా జిల్లాలో ఎంత విస్తీర్ణంలో ఏ పంటలు సాగు చేయనున్నారో ఇప్పటికే అధికారులు ఒక అవగాహనకు వచ్చినందున అందుకు అనుగుణంగా సాగుకు అవసరమయ్యే విత్తనాలను, ఎరువులను, క్రిమి సంహారక మందులను సిద్ధం చేసుకోవాలని ఆయన పేర్కొన్నారు.

అదేవిధంగా రైతుల అవసరాలను బలహీనంగా భావించే కొందరు వ్యాపారులు అక్రమాలకు పాల్పడి నకిలీ విత్తనాలు విక్రయించకుండా గట్టి చర్యలు తీసుకోవడంతోపాటు తనిఖీలు నిర్వహించాలని మరోవైపు అధిక ధరలకు ఎరువులు, విత్తనాలు విక్రయించకుండా, బ్లాక్ మార్కెటింగ్ చేయకుండా ఆకస్మిక తనిఖీలు చేయాలని డీలర్ల వద్ద స్టాక్స్ చెక్ చేయాలని ఆదేశించారు.

ఇప్పటికే ఫిర్యాదులు ఉన్నవారి విషయంలో జాగ్రత్తగా ఉండాలన్నారు. వ్యవసాయ శాఖ అధికారులకు వానాకాలం సీజన్ కొరకు ఆలోచించడమే అత్యంత ప్రాధాన్యత అంశమని ఈ విషయాన్ని వ్యవసాయ శాఖ అధికారులందరూ గుర్తుంచుకోవాలని స్పష్టం చేశారు. ఎక్కడ కూడా ఫిర్యాదులకు అవకాశం లేకుండా అదేవిధంగా రైతులకు ఎట్టి పరిస్థితిలోనూ ఎరువులు విత్తనాలు సరఫరా చేయడంలో సమస్యలు, ఇబ్బందులు రాకుండా ఖచ్చితమైన ప్రణాళికతో వాటిని ప్రతి రైతుకు అందే విధంగా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలన్నారు.

ఎరువుల తో వచ్చే రేక్ లు వెంటనే అన్‌లోడ్ చేయించాలని తద్వారా అవసరానికి అనుగుణంగా ఎరువులను సరఫరా చేసే అవకాశం ఉంటుందని ఈ విషయంపై ప్రత్యేక శ్రద్ధ కనబడతారు. ఎరువులు విత్తనాల సరఫరాలో రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా వ్యవసాయ పోలీస్ రెవెన్యూ అధికారులతో డివిజన్ స్థాయి టాస్క్ ఫోర్స్ టీంలు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు.

జిల్లాలో ఏడు లక్షలకు పైగా ఎకరాలలో వివిధ పంటలు వేస్తున్నందున పంటల సాగుకు అవకాశం ఉన్నందున ఆయా పంటల కు అనుగుణంగా ముందుగానే ఎరువులు విత్తనాలను నిర్వహించుకోవాలని ఆదేశించారు.

వ్యవసాయ శాఖ అధికారులు వివరించిన ప్రకారం యూరియా 77 వేల మెట్రిక్ టన్నులు అవసరం కాగా 22300, డి ఏ పి 16000 మెట్రిక్ టన్నులు అవసరం కాగా 2690 నిల్వ ఉందని, కాంప్లెక్స్ 33,000 మెట్రిక్ టన్నులు అవసరం కాగా 26450 మెట్రిక్ టన్నులు అందుబాటులో ఉన్నదని తెలిపారు. వరి విత్తనాలు ఒక లక్ష, 15 వేల క్వింటాళ్లు అవసరం కాగా ప్రభుత్వం వద్ద 13వేల క్వింటాళ్లు నిల్వ ఉందని డీలర్ల వద్ద లక్ష క్వింటాళ్లు అందుబాటులో ఉందని తెలిపారు.

ఈసారి వరి 3,82,000 ఎకరాలలో సాగు చేసే అవకాశం ఉందని పేర్కొన్నారు. అదేవిధంగా సోయాబీన్ 46000, మొక్కజొన్న 21000 కంది 43000, పత్తి 12000 ఎకరాలలో సాగుకు అవకాశమున్నట్లు తెలిపారు.

రైతుబంధు పథకంలో భాగంగా ఎవరైనా రైతులు వారి బ్యాంక్ ఖాతా, బ్యాంకు పేరు మారి ఉన్నట్లయితే వివరాలను వ్యవసాయ ఎక్స్టెన్షన్ అధికారులకు బ్యాంకు పేరు, ఖాతా నంబరు ఆధార్ నంబర్లను, పట్టాదారు పాసు బుక్కు వివరాలను అందించి మార్పులు చేయించుకోవాలని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి గోవిందు కోరారు.

సెల్ కాన్ఫరెన్స్ లో అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, డిసిఓ సింహాచలం, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి గోవిందు, సహాయ వ్యవసాయ శాఖ అధికారులు డిఎం మార్కుఫెడ్ త‌దితరులు పాల్గొన్నారు.

Check Also

మొబైల్‌ కూరగాయల‌ వాహనాలు ప్రారంభం

నిజామాబాద్‌, మే 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కొనసాగుతున్న లాక్‌ డౌన్‌ ను ద ృష్టిలో పెట్టుకొని ...

Comment on the article